ఇళ్లమధ్యలో ‘చెరువులు’… మరెవరో బాధ్యులు…?
సారపాక పట్టణంలో అపరిశుభ్రతతో జనం అవస్థలు
✍️ బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబరు 5)
‘ఇళ్ల మధ్య’లో అనేకచోట్ల చెరువులను తలపిస్తున్నట్లు నీటిమడుగులు… అందులో కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న చెత్తాచెదారం… భరించలేని స్థాయిలో పెరుగుతున్న క్రిమికీటకాలు, దోమలు… ఇలా రోగాలకు దారితీసే వాతావరణంలో ప్రజల బతుకు దుర్భరంగా మారింది. ఆ సమస్యలను పరిష్కరించి పారిశుద్ధ్యం కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు శాపంగా మారింది. బూర్గంపాడు మండలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, ఇంకా చెందుతున్న సారపాక గ్రామ పంచాయతీలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితి ఇది. వేలకు వేల రూపాయలు పన్నులరూపంలో వసూలు చేస్తున్న తమ గ్రామపంచాయతీ ఆ నిధులు ఏం చేస్తోందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 వేల జనాభాతో, ఇతర ప్రాంతాల వారికి అతి సుందరమైన, సౌకర్యవంతమైన జీవనానికి ఆలవాలంగా కనిపించే సారపాక గ్రామంలో స్థానికులు తాము పడుతున్న తీవ్ర అవస్థలెవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఈ పారిశ్రామిక పట్టణంలో ప్రస్తుతం పారిశుద్ధ్యం అత్యంత ప్రధానమైన సమస్యగా మారింది. అభివృద్ధి చెందినట్లు భావించే సినిమాహాలు ఏరియా, కండక్టర్స్ కాలనీ, ముత్యాలమ్మపేట, రాజు కాలనీ వంటి ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య సమస్యలున్నాయి. ఇంక సుందరయ్యనగర్, పాత సారపాక, బసప్పక్యాంపు, గాంధీనగర్, రాజీవ్ నగర్, ఒడిశాక్యాంపు వంటి ప్రాంతాల్లో అపరిశుభ్రతకు అనేకచోట్ల ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో తీవ్ర అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అనేకచోట్ల ఖాళీ స్థలాలు ఎవరివో? ఎందుకు ఖాళీగా ఉంచి అపరిశుభ్ర వాతావరణానికి కారణమవుతున్నారనేది దేవుడికే ఎరుక. ఇళ్లమధ్యలో ఉన్న ఖాళీస్థలాల్లో కనీస స్థాయిలో కూడా నిర్వహణ కొరవడటంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. ఖాళీ ప్రదేశాలన్నీ లోతట్టు ప్రాంతాలుగానే ఉండటంతో వర్షపునీరు చేరి, అక్కడే నిల్వ ఉంటోంది. దీనికితోడు చెత్తసేకరణ విధానాల్లోని లోపాల కారణంగా ప్రజలు కూడా తమ ఇళ్ల పక్కనే ఉన్న ఆ ఖాళీస్థలాల్లో చెత్తను పడేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నిల్వఉన్న నీటిలో మురిగిపోతున్న చెత్త విపరీతమైన అపరిశుభ్రతకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక గ్రామ పంచాయతీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో ఈ సమస్య తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. వవర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగానే అత్యధికంగా వ్యాధులు ప్రబలుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ పరిస్థితులను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన సారపాక గ్రామ పంచాయతీ ఆ దిశగా ఏదో చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఈ వర్షాకాలం కళ్లు మూసుకుంటే చాలు, ఈ సమస్యలు ఇట్టే గడిచిపోతాయనే ధోరణిలో అధికారులున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పన్నులు వసూలు చేసుకోవడం, ఆ నిధులు ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలంటూ ఖర్చు చేయడమే తమ పనిగా అధికారులు గడిపేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో కీలకమైన పారిశుధ్యం నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, క్లోరినేషన్ వంటి అతి కీలకమైన బాధ్యతలను అధికారులు నిర్లక్ష్యం చేయక ‘సీరియస్’ గా, అంకితభావంతో నెరవేర్చాలని సారపాక గ్రామ ప్రజలు కోరుతున్నారు.