లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు పంపిణీ చేసిన ఎస్పీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 3)
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళసభ్యులు, మిలీషియా సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంజూరైన రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,
కాలం చెల్లిన నిషేధిత సీపీఐ మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక, మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు లొంగిపోయినట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలు అందించి,వారు మెరుగైన జీవితాన్ని గడిపే విధంగా కృషిచేయడంలో జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులు కేవలం తమ ఉనికికోసమే అమాయకులైన ఆదివాసీ ప్రజలకు మాయమాటలు చెప్పి బలవంతంగా పార్టీలోకి చేర్చుకుని, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి వేస్తున్నారన్నారు. లొంగిపోయి సాధారణ జీవితం గలపాలనుకునే మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు తమ బంధుమిత్రుల ద్వారా గానీ, దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గానీ, పోలీసు అధికారుల వద్ద గానీ నేరుగా లొంగిపోవాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు దళసభ్యులతో పాటు మరో ఏడుగురు మిలీషియా, కమిటీ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెక్కులరూపంలో రివార్డ్ నగదు అంద జేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్, దుమ్ముగూడెం సీఐ అశోక్, ఎస్సై వెంకటప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.