గంజాయిని అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్
జిల్లా పోలీస్ అధికారుల సమీక్షా సమావేశంలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 16)
గంజాయి వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పని తీరు ప్రశంసనీయమని, లదే ఉత్సాహంతో మున్ముందు పనిచేయాలని మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కొత్తగూడెం సమీప హేమచంద్రపురంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పరిస్థితులను సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. సమావేశానికి విచ్చేసిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వాగతం పలికారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల పనితీరు, నిషేధిత మావోయిస్టుల కదలికల పట్ల, ప్రస్తుత స్థితిగతులను జిల్లా ఎస్పీ వివరించారు. ఐజీ మాట్లాడుతూ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ – చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నిషేధిత మావోయిస్టులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, వారిని నివారించాలని తెలిపారు. శాంతి భద్రతల పరి రక్షణ కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, 5 ఎస్ అమల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, ఫైళ్లు ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నిప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని తెలియజేశారు. పర్యటనలో భాగంగా హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు మొక్కలు నాటారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, డీసీఆర్బీ డీఎస్పీలు చంద్రభాను, డీఎస్పీ సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, మల్లయ్యస్వామి, ఏఓ జయరాజు, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.