దామరతోగులో ఎన్ కౌంటర్, మావోయిస్టు మృతి
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 25)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామరతోగు అటవీప్రాంతం పరిధిలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతిచెందగా, ఘటనాస్థలంలో పోలీసులు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం… గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలో మావోయిస్టు పార్టీ కమిటీకి చెందిన భద్రు, లచ్చన్నలతో పాటు దాదాపు 15 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు ఆయుధాలతో అక్రమంగా, అప్రజాస్వామికంగా దామరతోగు, గుండాల, కరకగూడెం, తాడ్వాయి అటవీప్రాంతంలో సంచరిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. వారందరూ వ్యాపారస్తులు, రైతులు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ మావోయిస్టు పార్టీ కోసం చందాలివ్వాలని చెబుతూ వసూళ్లకు తెగబడుతున్నారని నమ్మదగిన సమాచారం అందినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు ఆ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించి, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కూంబింగ్ ఆపరేషన్ ను చేపట్టినట్లు ఆయన వివరించారు. ఆ దామరతోగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీస్ బలగాలపై అకస్మాత్తుగా, మారణాయుధాలతో నిషేధిత మావోయిస్టులు కాల్పులు జరిపారని ఎస్పీ వెల్లడించారు. పోలీస్ బలగాలు లొంగిపొమ్మని అక్కడి మావోయిస్టుల్ని హెచ్చరించినప్పటికీ లెక్కచేయకుండా పోలీసులను చంపాలనే ఉద్దేశ్యంతో చుట్టుముట్టి మరీ ఇంకా అధికంగా కాల్పులు జరిపారని ఎస్పీ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మావోయిస్టులను నివారించడంకోసం వారిపై పోలీసులు ఎదురుకాల్పులు జరపినట్లు వివరించారు. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో, కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సోదా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించిన 25 ఏళ్ల యువకుడి మృతదేహం, 303, ఎస్ఎల్ఆర్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విప్లవసాహిత్యం, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.