అంగన్వాడీలకు వేతనం పెంచాలని కలెక్టరేట్ ముట్టడి
పప్పు, నూనె, గుడ్లు, పాలు సకాలంలో అందించాలని డిమాండ్
✍️ కొత్తగూడెం – దివిటీ (జూన్ 24)
తమకు వేతనాలు పెంచాలని, పోషకాహార సరకులు సకాలంలో అందించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించాలని, తదితర డిమాండ్లతో సోమవారం అంగన్వాడీ సిబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టరెట్ ముట్టడించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) తరపున జిల్లా నలుమూలలనుంచి వచ్చిన అంగన్వాడీ సిబ్బంది ముట్టడి చేసి, పెద్ద పెట్టున ఎండలోనే నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్వంచ, ములకలపల్లి ఎస్సైలు రాము, రాజామలి అద్వర్యంలో మహిళా కానిస్టేబుల్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ, 1975 నుంచి ఐసీడీఎస్ లో గౌరవవేతనం పేరుతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తురన్నారు. చాలీచాలని తక్కువ వేతనం పొందుతూ కుటుంబపోషణ భారంగా మారిన జీవితాలను వెలదీస్తున్న అంగన్వాడి టీచర్లకు కనీస వేతనం రూ.26000, హెల్పర్స్ కు రూ.21000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 24రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేసినప్పుడు అంగన్వాడీ టీచర్లకు రూ.18000, హెల్పర్లకు రూ.15000 చొప్పున ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారం లోకి రావడంతోనే వేతనాలు పెంచుతామని ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి కూడా నాడు హామీ ఇచ్చారన్నారు. రిటైర్మెంట్ అవుతున్న టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం సమ్మె కాలంలో తెలియపరిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు రూ.1లక్ష, హెల్పర్లకు రూ.50వేలు ఇచ్చేలా జీఓ ఇచ్చారన్నారు. దీనివల్ల 45 ఏళ్లపాటు డిపార్ట్మెంట్ నమ్ముకున్న అంగన్వాడీ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ జీవోలను రద్దుపరిచి సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. టీఏ, డీఏలు, పెండింగ్ ఇంటిఅద్దెలు, గ్యాస్ బిల్లులు, అరోగ్యలక్ష్మి బిల్లులు ఇవ్వాలని కోరారు. అదనపు యాప్స్, బీఎల్ఓ డ్యూటీ రద్దు చేయాలని, అంగన్వాడీలకు టాబ్స్ ఇవ్వాలని, అంగన్వాడీ కేంద్రాలకు బిల్డింగులు, తాగునీరు, కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. డిమాండ్లు తక్షణమే పరిష్కరించకపోతే వచ్చే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని అయన హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మని, ప్రధానకార్యదర్శి రెడ్డి అరుణ,
ఏఐటీయూసీ సహాయకార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, జిల్లా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.