అక్రమార్కులకే అందలం… అభివృద్ధికి మంగళం…
‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో అక్రమాలకు అడ్డుకట్ట లేదా?
అధికారుల అవినీతిదాహంతో హడలెత్తుతున్న సిబ్బంది
✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 24)
అభివృద్ధికోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న విలువైన ప్రజాధనం అక్రమార్కులు, అవినీతిపరులకు ఆదాయ మార్గంగా మారుతుంటే, అంతోఇంతో అంకితభావంతో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది… ఆ సంస్థలో అక్రమార్కులే అందలం ఎక్కి స్వైరవిహారం చేస్తుంటే అభివృద్ధికి మంగళం పాడి ఆస్తులు పెంచుకుంటుంటే అవినీతి, అక్రమాలకు సంస్థ నిలయంగా మారిపోయే పరిస్థితులేర్పడ్డాయి… తమపై అధికారుల అవినీతి దాహాన్ని తీర్చలేక, ఆ కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వర్తించలేక హడలెత్తిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రత్యేక సంస్థగా విద్యా, సంక్షేమ, మౌళిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటుచేసిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులివి… ఈ దుస్థితి గురించి “దివిటీ మీడియా” అందిస్తున్న ప్రత్యేక కథనమిది…
రాష్ట్రంలో విద్య, సంక్షేమ రంగాల్లో సదుపాయాలను మెరుగుపర్చడం కోసం ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ నిధులు కొందరు అవినీతిపరులు, అక్రమార్కులైన అధికారులకు వరంగా మారాయి. ఆ సంస్థలో పనిచేసే ఓ ఈఈ, తనకు కాసులు కురిపించే విధంగా పనులు చేస్తూ అందినంత దండుకుంటున్నారు. తెలంగాణలో దాదాపు రూ.100కోట్ల విలువైన కాస్మెటిక్స్, శానిటరీ ప్యాడ్స్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కీలకమైన అధికారులలో ఒకడిగా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారాయన. 2016 అక్టోబరులో ఓ కాంట్రాక్టర్ దగ్గర రూ.27వేలు లంచం తీసుకుంటూ, ఏసీబీకి పట్టుబడిన ఆ అధికారి, తన పలుకుబడితో ఓ ఉమ్మడి జిల్లా (రెండు జిల్లాల) పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. అప్పటి కేసులో ఆయన ఆస్తుల వివరాలు కావాలని ఏసీబీ ఏకంగా ఆ సంస్థ ఉన్నతాధికారులకు లేఖ కూడా రాసిన చరిత్ర ఉంది. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఆ ఉన్నతాధికారి, తాను ఎదుర్కొంటున్న విచారణలు, కేసుల విషయాన్ని పక్కనపెట్టి మరీ ఇంకా చెలరేగిపోతున్నారు. అతనిపైనున్న కేసుల విషయాన్ని పట్టించుకోకుండా ఆ సంస్థ ఉన్నతాధికారులే ఆయనకు రెండు జిల్లాల బాధ్యతలు కట్టబెట్టడంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన ఇంటి వద్ద నుంచే ఆఫీసు వ్యవహారాలను పర్యవేక్షించడాన్ని బట్టి చూస్తే, ఆయన వ్యవహరశైలి అర్థంచేసుకోవచ్చు. సెలవులే పెట్టకుండా, ఓవైపు సొంత పనులు, మరొక వైపు ఆఫీసు పనులు ఏకకాలంలో చక్కబెట్టుకోవడం ఆయన ఒక్కరికే సాధ్యమవుతోందంటే ఆయనకున్న ‘సామర్థ్యం’ అర్థం చేసుకోవాల్సిందే. (ఈ విషయాలన్నీ మరోసారి సవివరంగా మీకందిస్తాం).
***
తనకు తోడు మరో అక్రమార్కుడిని అందలమెక్కించే ప్రయత్నంలో అవినీతి ఉన్నతాధికారి…
***
రెండు జిల్లాల ఉన్నతాధికారిగా ఎదురూ బెదురూ లేని విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఆ ఉన్నతాధికారి తాజాగా తనకు సరిజోడీగా మరో అవినీతి అధికారిని తనకు సాయంగా అందలమెక్కించేందుకు పావులు కదుపుతున్నారు. 2005-06లో పనికి ఆహారపథకం పనుల్లో ఆ ఉన్నతాధికారి, అతనికి సహాయకారిగా జూనియర్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించినపుడు ఇద్దరూ కలిసి దాదాపు రూ.1-50కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించిన అనుబంధం ఉంది. అప్పటి ఆ నిధుల వ్యవహారంలో సస్పెండైన ఆ అధికారే ఇప్పుడు టీజీఈడబ్ల్యుఐడీసీ’లో కూడా ఆ ఉన్నతాధికారి కిందనే పనిచేస్తున్నారు. తమ మధ్యనున్న ఆ అనుబంధంతోనే ఓవైపు కేసు విచారణలో ఉన్న ఆ జూనియర్ అధికారికి పూర్తిస్థాయి బాధ్యతలతో తనపరిధిలోనే మళ్లీ పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆ ఉన్నతాధికారి అడ్డదారిలోనే పావులు కదులుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి తమ అక్రమాలకు అనుకూలంగా లేనివారిని ‘టార్గెట్’ చేసి మరీ అవస్థలు పెడుతున్న పరిస్థితుల్లో జూనియర్ అధికారి పూర్తిస్థాయి అధికారిగా ఇక్కడకొస్తే పరిస్థితి మరింత ఘోరంగా దిగజారుతుందని కిందిస్థాయిలో సిబ్బంది భయపడుతున్నారు. ఆ ఉన్నతాధికారులిద్దరి అక్రమాలకు సహకరించకపోతే, తమను ఏదోవిధంగా ‘బలిపశువులను’ చేస్తారని ఆందోళన చెందుతున్నారు. ఈ దుస్థితిలో ఆ ఇద్దరు అధికారుల వ్యవహారాలపైన పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుని, సంస్థ భవిష్యత్తును, ప్రజాధనాన్ని కాపాడాలని వారు కోరుకుంటున్నారు.
కాగా ఈ విషయాలన్నింటినీ ‘దివిటీ మీడియా’ ఆ సంస్థ యాజమాన్యం (అత్యున్నతాధికారుల) దృష్టికి తీసుకెళ్లడంతో కదలిక మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకునే అంశంపై ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ అత్యున్నతాధికారులు స్పందించారు.