ఐటీసీ పరిశ్రమలో ఘనంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు
✍️ దివిటీ మీడియా – సారపాక (జూన్ 5)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో బుధవారం 52వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆ పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ కె.రాంబాబు, ఎన్విరాన్మెంట్ హెడ్ ప్రపుల్ల సమంత సింగార్, టెక్నికల్ హెడ్ జె.కె.దాస్ ముఖ్య అతిథులుగా ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఐటీసీ ఫ్యాక్టరీ గేట్ వద్ద జరిగిన పర్యావరణ ర్యాలీలో కార్మికులు, మేనేజర్లు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన మార్గాలపై ముఖ్య అతిథులు అందరికి అవగాహన కల్పించారు.
ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాలు, క్విజ్ కాంపిటీషన్ పోటీలలో గెలుపొందిన కార్మికులు, మేనేజర్లు, కాంట్రాక్టు కార్మికులు, గృహిణులు, పిల్లలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ తూర్పు, పశ్చిమ గేట్లు, సంస్థ అనుబంధ విద్యాలయం ఆవరణ, తదితర ప్రాంతాల్లో పలుచోట్ల 6,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ కె.రాంబాబు, ఎన్విరాన్మెంట్ హెడ్ ప్రపుల్ల సమంతసింగార్, టెక్నికల్ హెడ్ జె.కె.దాస్, అధికారులు, ప్రతినిధులు టి.ఎస్.భాస్కర్, కె.రవికుమార్, చెంగల్రావు, ఎం.సత్యనారాయణ, సంస్థ అనుబంధ విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.