కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి కేకే, ఆయన కూతురు మేయర్ విజయలక్ష్మి
పార్టీ వీడొద్దన్న కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన కేకే
కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరనున్న మేయర్ విజయలక్ష్మి
✍️ దివిటీ మీడియా – హైదరాబాదు, మార్చి 28
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్ష నేత కె కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని గురువారం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం తాను కాంగ్రెస్ లో చేరతానని విజయలక్ష్మి తెలిపారు. విజయలక్ష్మి చాలారోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఇటీవల కేశవరావు కూడా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై వ్యతిరేక కామెంట్స్ చేశారు. ఈ పరిస్థితుల్లో తండ్రీకూతుళ్ల పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతోంది. ఎంపీ కేశవరావును గురువారం ఎర్రవల్లిలోని తవ ఫామ్ హౌజ్ కి పిలిపించుకున్న మాజీ సీఎం కేసీఆర్ దాదాపు గంటకు పైగా మాట్లాడి బుజ్జగించేందుకు విఫలయత్నం చేశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగాలని కేసీఆర్ కోరినప్పటికీ, కేశవరావు సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. కేసీఆర్ తో సమావేశం తర్వాత తిరిగి హైదరాబాద్ వేరుకున్న కేకే, కూతురితో కలిసి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. “నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే… ఆ పార్టీ నాకు సొంతిళ్లు లెక్క.. తీర్థయాత్రలకు వెళ్లినవాళ్లు ఎప్పటికైనా ఇంటికి తిరిగి రావాల్సిందే కదా… నేను కూడా సొంతింటికి వెళ్తున్నాను… కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రజా సేవ చేయాలనుకుంటున్నాను… ఆ పార్టీలోనే చనిపోవాలని కోరుకుంటున్నాను.. 53 ఏండ్లు కాంగ్రెస్ లో పని చేశా… పదేండ్లు మాత్రమే బీఆర్ఎస్ లో ఉన్న… తెలంగాణ ఏర్పాటు కోసమే ఆ పార్టీలో చేరా… రాజ్యసభకు మొదటిసారి కాంగ్రెస్ వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచా… ” అంటూ కేకే వ్యాఖ్యలు చేశారు. చేరిక డేట్ ఇంకా ఫిక్స్ కాలేదన్న కేశవరావు, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని కూడా గుర్తు చేశారు. “శనివారం నేను కాంగ్రెస్ లో చేరట్లేదు… ఏరోజు కాంగ్రెస్ కండువా కప్పుకుంటనో త్వరలోనే చెప్తా… మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నరు…” అన్న కేక్, తానింకా బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదన్నారు. ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో భేటీ అయిన మాట వాస్తవమేనని కేకే తెలిపారు. పార్టీ అంతర్గత అంశాలపైనే తాము మాట్లాడుకున్నామని, బీఆర్ఎస్ లో మంచి కేడర్ ఉందని, చదువుకున్న పిల్లలు కేడర్ లో ఉన్నారని, వాళ్లకు అవకాశమిస్తే బాగుంటుందని కూడా తాను కేసీఆర్ కు సూచించినట్లు కేశవరావు వివరించారు. కవిత అరెస్టుపై కూడా తమ మధ్య చర్చ జరిగిందని కూడా కేకే ఈ సందర్భంగా వెల్లడించారు.
అధికారపార్టీలో ఉంటేనే పనులు జరుగుతయ్: మేయర్ విజయలక్ష్మి
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం తాను కాంగ్రెస్ లో వేరుతున్నట్లు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. మేయరుగా ఉన్న తాను కొందరు కార్పొరేటర్ల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, అధికారులు కూడా సహకరిస్తారని, లేకపోతే డెవలప్ మెంట్ కష్టమవుతుందని అమె చెప్పారు. పది రోజుల నుంచి పార్టీ మార్పుపై తాను చాలామందితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని వివరించారు. కాగా మేయర్ విజయలక్ష్మితోపాటు కొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది.