ఇసుక అక్రమార్కుల ‘అధికారిక తిరుగుబాటు’…
అధికారులు తీయించిన కందకం పూడ్చి మరీ సవాల్ విసిరారు
✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 24
సిద్ధాంతాల పేరుతో, మార్పుకోసమనే లక్ష్యంతో అడవుల్లో ఉంటూ పోరాటం చేసే తిరుగుబాటు దారులే 'తమకంటే నయం' అనిపించేలా ప్రభుత్వ అధికారయంత్రాంగానికే సవాల్ విసిరారు ఇసుక అక్రమ రవాణాదారులు… ఇసుక అక్రమ రవాణా అరికడతామంటూ ప్రభుత్వ అధికారయంత్రాంగం తీసుకున్న చర్యలను కేవలం గంటల వ్యవధిలోనే రూపుమాపి 'సరికొత్తగా తిరుగుబాటు' చేశారు… తాము తలచుకుంటే ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేసి, సమాంతర పరిపాలన సాగిస్తామనే విధంగా బరితెగించారు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఇసుక అక్రమ రవాణాలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయింది. వివరాలిలా ఉన్నాయి…
File photo
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల చర్యలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని ఎలాగైనా నిరోధించాలని ఆమె జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని స్పష్టంగా ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టిన తహసిల్దారు ముజాహిద్ శుక్రవారం ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాల్లో వాహనాలు తిరగకుండా కందకాలు తవ్వించారు. రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో తవ్వించిన ఈ కందకాలను ఇసుక అక్రమ రవాణాదారులు కేవలం గంటల వ్యవధిలోనే పూడ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం అధికారుల మెతక వైఖరిని అడ్డం పెట్టుకుని యధేచ్ఛగా అక్రమ రవాణా చేసిన కొందరు వ్యక్తులు, ఏకంగా ప్రభుత్వ వ్యవస్థపైనే తిరుగుబాటు చేస్తూ ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లు రెచ్చిపోవడం గమనార్హం. ఓ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహసిల్దారు తీసుకున్న చర్యలనే ప్రశ్నార్థకంగా చేస్తూ ‘ఇసుక మాఫియా’ బరితెగింపు చర్యలు చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యవహారంతో తమను ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదనే తిరుగుబాటు ధోరణితో రెచ్చిపోయిన అక్రమార్కుల తీరు చూస్తే, తాము అన్నింటికీ అతీతంగా సమాంతర పాలన సాగిస్తామంటూ ‘సవాల్’ విసిరినట్లేనని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇసుక అక్రమార్కులు ఎవరి అండతో ప్రభుత్వ అధికారయంత్రాంగంపైనే తిరుగుబాటు చేస్తున్నారనేది తేల్చాల్సిన బాధ్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులపైనే ఉంది. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న అక్రమార్కుల బరితెగింపు వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఏరకమైన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.