గోదావరిని కొల్లగొడుతున్నవారిని ఆపేందుకు గోతులు తవ్వారు…
ఇసుక అక్రమార్కుల దాహానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారుల యత్నం
✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 23
బంగారం కంటే ఎక్కువ డిమాండుతో కాసులవర్షం కురిపిస్తున్న ఇసుకను దర్జాగా దోచుకుని తింటున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు బూర్గంపాడు మండలంలో అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పేరుపొందిన ఈ మండలంలో అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోననే ఆసక్తి ఇప్పుడు మండల ప్రజలందరిలోనూ నెలకొంది. ఇంతకాలం ఇసుకను అక్రమంగా దోచుకుంటుంటే, అడ్డుకోవాల్సిన తమ బాధ్యతను మర్చిపోయిన అధికారులకు భిన్నంగా కొత్తగా వచ్చి బాధ్యతలు చేపట్టిన అధికారులు ఈ వ్యవహారంలో చర్యలు ఆరంభించారు. మండలం పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు నిలయాలుగా మారిపోయిన ప్రాంతాల్లో ‘కందకాలు’ తవ్వించడం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇసుక మాఫియాకు నిలయంగా మారిపోయిందనే పేరు సంపాదించిన బూర్గంపాడు మండలంలో, ఈ చర్యలు చిత్తశుద్ధితో కొనసాగిస్తేనే కొంతైనా మార్పు సాధ్యమని, సరైన ఫలితముంటుందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. మండలంలో ఇంతకాలం అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఇసుక దోపిడీ యధేచ్ఛగా కొనసాగించిన అక్రమార్కులకు అడ్డుఅదుపూ లేకపోయింది. ఈ మండల పరిధిలో తాళ్లగొమ్మూరు, సారపాక, గొమ్మూరు, ఇరవెండి, మోతె, సోంపల్లి, బుడ్డగూడెం, ఉప్పుసాక, పినపాక పట్టీనగర్, తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో ఇసుక అక్రమరవాణానే తమ వృత్తిగా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజూ రూ.లక్షలు గడించే అవకాశం ఉందనే కారణంతో అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులతో సంబంధాలు పెంచుకుని, వారి అండతో రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులను నిరోధించేందుకుగాను మండలాధికారులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు స్వాగతిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం : బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్
బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తహసిల్దారు ముజాహిద్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలం పరిధిలో ఇసుక అక్రమంగా రవాణా చేసే అవకాశాలున్న ప్రాంతాల్లో కందకాలు తవ్వించామని వెల్లడించారు. ఎక్కడైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గమనించినవారు వెంటనే తమకు సమాచారమందించాలని ఆయన కోరారు. సమాచారం అందించినవారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు అక్రమ రవాణా చేసే వారిపై కఠినచర్యలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తహసిల్దారు ముజాహిద్ హామీ ఇచ్చారు. విలేఖరుల సమావేశంలో డెప్యూటీ తహసిల్దారు రాంనరేష్, ఆర్ఐ నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.