అడవిజంతువుల వేటపై అప్రమత్తమైన పోలీసు శాఖ
వేటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, ఫిబ్రవరి 12
చాలాకాలం తర్వాత అడవిజంతువుల వేట నిరోధానికి తెలంగాణలో పోలీసుశాఖ కఠినచర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. భూపాలపల్లి జిల్లాలో వీఐపీల పర్యటన కోసం బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా కూంబింగ్ కోసం వెళ్లి, గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన పోలీసు కమాండో ప్రవీణ్ (31) ప్రమాదంలో మరణించిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ములుగు జిల్లాలోనూ సోమవారం ఇదే తరహా విషాదం మరొకటి చోటుచేసుకుంది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెం గ్రామంలో అటవీ జంతువుల కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి పండి రమేశ్(23) అనే యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. అడవిజంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి ఒకేరోజు ఇద్దరు మృతి చెందడం విషాదకరంగా మారింది. ఒకే రకమైన ఈ రెండు దుర్ఘటనలతో రాష్ట్రంలో పోలీసుశాఖ ఒక్కసారిగా ‘అలర్ట్’ అయింది. దాదాపు పదేళ్ల నుంచి అడవిజంతువుల వేట నిరోధించడానికి చర్యలు తీసుకునే విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీసుశాఖ, తాజా దుర్ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కఠినచర్యలు ఆరంభించింది. దీనిలో భాగంగా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతో జిల్లాల ఎస్పీలు తమ తమ పరిధిలో అడవిజంతువుల వేట వ్యవహారంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అటవీప్రాంతాల్లో అడవిజంతువులను వేటాడేందుకు, వాటి మాంసం విక్రయాలు సాగించేందుకు ప్రత్యేకమైన ముఠాలు ఉన్నాయి. అడవిజంతువులను వేటాడేందుకు సులభమైన పద్ధతిగా ‘విద్యుత్తు ఉచ్చులు’ అడవుల్లో అమర్చడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో ఆ విద్యుత్తు ఉచ్చులకు తగిలిన జంతువులు ‘విద్యుత్తు షాక్’తో అక్కడ చనిపోతే దానిని తెచ్చి సొంతంగా తినడంతోపాటు మిగిలిన మాంసం అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటారు. పెంపుడు పశువులు మేపేందుకో, వంటచెరుకు (పొయ్యిలో వాడుకునే కట్టెలు) కోసమో, మరేదైనా ఇతర అవసరాల కోసమో అడవిలోకి వెళ్లేవారు, జంతువుల వేట కోసం అమర్చిన ఆ విద్యుత్తు ఉచ్చులు పొరపాటున తగలడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. పశువుల కాపరుల వంటి సామాన్య ప్రజలతో పాటు, పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అడవిజంతువుల వేట కాస్త తగ్గడం, ఇతరత్రా కారణాల వల్ల పోలీసులు దీని గురించి ‘సీరియస్’ గా తీసుకోలేదనే చెప్పవచ్చు. భూపాలపల్లిలో చోటు చేసుకున్న తాజా ఘటనలో ఏకంగా కూంబింగ్ కోసం వెళ్లిన ఓ గ్రేహౌండ్స్ కమాండో మరణించడంతో పోలీసులు ఈ తరహా వేట వ్యవహారంపై దృష్టి సారించారు. ఈ మేరకు
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ దుర్ఘటన గురించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సీరియస్ నెస్ దృష్ట్యా రాష్ట్రంలో ఇతర జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు కూడా అప్రమత్తమై, ఈ తరహా ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో అడవి జంతువులను వేటాడటానికి ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠినచర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు కరెంట్ తీగలను ఏర్పాటు చేయడం వలన పంట పొలాలకు పనులకు వెళ్లే రైతులు, జంతువులు షాక్ నకు గురయ్యి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంభవించి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ తెలియజేశారు. ఇలాంటి దుర్భర ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువులను వేటాడటం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఆఫీసర్ అక్కడ అడవిలో అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యక్తులు ఈ విధంగా అక్రమంగా కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.