విద్యతోపాటు నైపుణ్యంతోనే ఉద్యోగావకాశాలు
✍🏽 దివిటీ – కొత్తగూడెం (జనవరి 9)
విద్యకు నైపుణ్యం తోడైతేనే కొలువుల ప్రపంచంలో విజయం సాధించడం ఖాయమని కార్మికశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ అధికారి షర్ఫుద్దీన్ తెలిపారు.
మంగళవారం కొత్తగూడెంలోని ఎస్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జిల్లాలోని కార్మికుల పిల్లలకు ఉచిత కెరీర్ గైడెన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాపునకు ముఖ్యఅతిథిగా హాజరైన షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఎంత ఉన్నతస్థాయి విద్యావంతులకైనా నైపుణ్యం ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వయంఉపాధి, నైపుణ్యాభివృద్ధికోసం పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సెట్విన్, తెలంగాణ భవననిర్మాణ కార్మికశాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. 46 రకాల కోర్సుల్లో యాప్ ద్వారా ఉచిత ఆన్లైన్ శిక్షణతోపాటుగా స్వయం ఉపాధి అవకాశాలు అందిస్తుందని చెప్పారు. ఉచిత ఆన్లైన్ శిక్షణకు సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మికశాఖ సంయుక్తంగా ఆ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రినిస్పల్ హావిన మాట్లాడుతూ, విద్యార్ధులు ఈ సంస్థ ఉచితంగా అందిస్తున్న విద్యాకోర్సులను వినియోగించుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ యు.నాగేశ్వరావు, ప్రాజెక్టు లీడ్స్ సాదిక్, జి.సూరిబాబు పాల్గొని 210మంది విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు.