ట్రాక్టర్ల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు తప్పనిసరి
: ఎస్పీ రోహిత్ రాజు
రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా నియమాలు పాటించాలని పిలుపు
✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 9)
రోడ్డుప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నియమాలు పాటించాలని, ట్రాక్టర్లకు వెనుకభాగంలో తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అంటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ల యజమానులు ట్రక్కుల వెనుక భాగాన రేడియం స్టిక్కర్లు అంటించి, వెనుక నుంచి వచ్చే వాహనదారులకు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే ఆకతాయిలపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుప్రమాదాలను అరికట్టే చర్యలలో భాగంగా జిల్లాలో పోలీసులు తీసుకునే చర్యలకు ప్రజలంతా తమవంతుగా సహకరించాలని ఈ సందర్బంగా ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు.