విద్యారంగ అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆజాద్
✍🏽 దివిటీ మీడియా – హన్మకొండ
ఓట్లు, సీట్లు, అధికార పీఠం పట్ల ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ విద్యారంగాభివృద్ధి, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలకు ఎందుకు లేదో తెలంగాణ విద్యార్థి, యువతకు పాలకులు సమాధానం చెప్పాలని, లేకపోతే తెలంగాణ విద్యార్థి, యువతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.ఆజాద్ అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ వద్ద ‘విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో’ భాగంగా విద్యార్థి అమర వీరుల చిత్రపటాలకు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అధ్యక్షతన జరిగిన “విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభ”లో ఆజాద్ మాట్లాడారు. పదేళ్ల బీజేపీ, బిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా విధ్వంసమైందని, గత ఎన్నికల సందర్భంగా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోడీ, ఇంటికొక ఉద్యోగంతో పాటు ఉద్యోగం లేని నిరుద్యోగులకు సైతం నిరుద్యోగ భృతి కల్పిస్తామని కేసీఆర్ అనేక మోసపూరిత వాగ్దానాలిచ్చారని చెప్పారు. తీరా గద్దెనెక్కినంక తెలంగాణ విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా తీవ్రంగా మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే హైస్కూల్ స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల వరకు ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలను తలదన్నే రీతిలో అన్ని రకాల ఫీజులు పెంచుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింమైనారిటీవర్గాల విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సరిపడా నిధుల కేటాయింపులు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు, నాణ్యమైన పరిశోధనలు రోజురోజుకు కుంటు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్యా సాధనతోపాటు కులం, మతం, అసమానతలు లేని సమానత్వ సమాజ స్థాపన కోసం విప్లవ విద్యార్థి ఉద్యమంలో ప్రాణాలర్పించిన విద్యార్థి అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని గుర్తు చేశారు. ఉద్యోగాలు రాకపోతే విద్యార్థి ,యువత ఆత్మహత్యలవైపు ఆలోచించకుండా విప్లవ విద్యార్థి అమరవీరులైన జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖరప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, దుస్స చేరాలు, రంగవల్లి, మారోజు వీరన్నలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థులంతా గ్రామాలకు తరలి వెళ్లి తెలంగాణ సమాజానికి, ప్రజానీకానికి కేసీఆర్, మోడీ పాలనలో విద్యారంగానికి, విద్యార్థి, యువతకు జరిగిన అన్యాయాలు వివరించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అలువాల నరేష్, జిల్లా నాయకులు ప్రవీణ్, వినయ్, కాకతీయ యూనివర్సిటీ నాయకులు అభిరాం రమేష్, అశోక్, సంగీత, కావేరి, ప్రశాంత్, రమేష్, నవీన్, క్రాంతి, శ్రీనివాస్, మోతిలాల్, షరీఫ్, అనిల్ నాయక్, శ్రీలత, షబానా, శ్రీలక్ష్మి, చందన, తదితరులు పాల్గొన్నారు.