Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamPoliticsSpecial ArticlesTelangana

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న అసంతృప్త నేతలు

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న అసంతృప్త నేతలు

తమ రాజకీయ భవిష్యత్తు, బీఆర్ఎస్ ఓటమికోసం ఐక్యతారాగం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పొంచి ఉన్న ప్రమాదం

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమ అధినాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే  పని చేసేందుకు ఉత్సాహం చూపిన నేతలు,  మారిన రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఆయనకు దాదాపు శత్రువులుగా మారారు.  ఆయననే నమ్ముకుని తోడునీడగా నడుస్తూ వస్తున్న తమను ‘కరివేపాకు’లాగా చేశారనే కోపం, అసంతృప్తితో ఆయనకు దూరమైన నాయకులు కారాలుమిరియాలు నూరుతూ ఏకమవుతున్నారు. కేసీఆర్ మరోసారి సీఎం  కుర్చీలో కూర్చోకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చాటిచెప్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలకు కారణమవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన పరిస్థితులతో ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ వ్యతిరేకులందరూ ఏకతాటిపైకొస్తూ ఐక్యతారాగం అందుకున్నారు. ఉమ్మడిజిల్లా  రాజకీయాల్లో కీలకమైన జలగం కుటుంబం నుంచి ఎదిగిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేసి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరతుండటం సంచలనం సృష్టిస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు కాలరాచేలా 2018  అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుకు అవకాశమిచ్చి ప్రోత్సాహిస్తున్న సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై జలగం వెంకట్రావు అసంతృప్తితోనే ఇంతకాలం వేచి చూశారు. కొత్తగూడెంలో  వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో ఇటీవల తనకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పు  వెంకట్రావుకు అనుకూలంగా ఉంది. తీర్పుపై వనమా అప్పీలుకు వెళ్లినప్పటికీ, వనమా తనయుడు రాఘవ వ్యవహారంతో ఈసారి తనకు తప్పక టిక్కెట్ వస్తుందనే ధీమాతో ఉన్న తనకు ఈసారి కూడా కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదని వెంకట్రావు అసంతృప్తితో రగిలి పోతున్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయం చూసుకుని కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నారు. ఇంతకాలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ మీద ఆశలు పెంచుకుని, నిరాశతో తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో ముందుకు సాగాలని వెంకట్రావు నిర్ణయించుకున్నారు. ముగ్గురికి ఉమ్మడి రాజకీయ శత్రువుగా మారిపోయిన కేసీఆర్ ను దెబ్బతీయడమే తమ ఐక్యంగా పావులు కదుపుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా బీఆర్ఎస్ గెలుపు మీద ప్రభావం పడే పరిస్థితులేర్పడ్డాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఉమ్మడి జిల్లాలోనే  కీలకమైన మూడువర్గాలకు చెందిన నేతలు ఒక్కతాటిపై నిలుస్తుండటంతో సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అసలే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అంతంత మాత్రమే బలమున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారిన   రాజకీయ పరిస్థితులు మరింత గడ్డుస్థితికి దారితీయొచ్చని పరిశీలకులు అంచనాలు  వేస్తున్నారు. ఈ పరిస్థితులను సరిచేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏవిధంగా ముందుకెళ్లబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘కోడిపందేల’పై బూర్గంపాడు పోలీసుల దాడి

Divitimedia

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్

Divitimedia

19 నుంచి గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు

Divitimedia

Leave a Comment