మణుగూరులో పొలిటికల్ హీట్ ; హోర్డింగుల ధ్వంసం వివాదం
తన హోర్డింగులు చింపిన వారిపై చర్యలు తీసుకోవాలన్న స్వతంత్ర అభ్యర్థి దుర్గ
✍🏽 దివిటీ మీడియా – మణుగూరు
పినపాక నియోజకవర్గ కేంద్రం మణుగూరు తాజాగా ‘ఎన్నికల ప్రచార హోర్డింగుల’ వివాదానికి వేదికైంది. ఈ నియోజకవర్గంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న విషయం ప్రకటించిన పాల్వంచ దుర్గ, తన ప్రచార హోర్డింగులను పలుచోట్ల ఏర్పాటు చేసుకున్నారు. ఆమె తన ఎన్నికల ప్రచారం కోసం మణుగూరులోని రధంగుట్ట ఏరియా, సీఎస్పీ సెంటర్, సింగరేణి చెక్ పోస్ట్, భద్రాచలం క్రాస్ రోడ్, రైల్వే గేట్ ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ హోర్డింగులపై అంటించి ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. ఒక స్వతంత్ర అభ్యర్థి గానే పోటీ చేస్తున్న తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన ప్రధాన ప్రత్యర్థులు ఈ పని చేశారని పాల్వంచ దుర్గ ఆరోపించారు. ఒకవిధంగా చూస్తే ఆమెకు మణుగూరు ప్రాంతంలో నిజంగానే ప్రజలు ఎక్కువగా మద్దతునిస్తున్నారనే అక్కసుతో ప్రత్యర్థులు, ఆమె ప్రచార సామగ్రి ధ్వంసం చేశారనే అనుమానాలు కూడా వస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల కోడ్ వల్ల అధికారులే వాటిని తొలగించారేమోననేది కూడా అనుమానం కలుగుతున్నప్పటికీ, ఆ ప్రచార సామగ్రి ఏర్పాటు కోసం అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నట్లు దుర్గ చెప్తున్నారు. ఏదిఏమైనా ఈ ప్రచార సామగ్రి ధ్వంసం వ్యవహారం మణుగూరు ప్రాంతంలోనే కాకుండా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దుర్గ మాత్రం ఈ దుశ్ఛర్యలో ప్రధాన ప్రత్యర్థుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
———————-
కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలి : పాల్వంచ దుర్గ
———————–
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీచేస్తున్న తన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను చింపి కొందరు వ్యక్తులు రాక్షసానందం పొందుతున్నారని, ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన ప్రజల నుంచి తమను వేరుచేయలేరని పినపాక నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిని పాల్వంచ దుర్గ అన్నారు. తన ఎన్నికల ప్రచారం నిమిత్తం హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు, మణుగూరు రధంగుట్ట ఏరియా, సీఎస్పీ సెంటర్, సింగరేణి చెక్ పోస్ట్, భద్రాచలం క్రాస్ రోడ్, రైల్వే గేట్ వద్ద నియోజకవర్గం ఎన్నికల అధికారుల నుంచి అనుమతి పొందానన్నారు. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలను చింపివేసి కొందరు నాయకులు శునకానందం పొందుతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, కబ్జాలు, దారుణాలు వెలుగు చూస్తున్న పినపాక నియోజకవర్గంలో, ప్రజలు కొత్తవ్యక్తిని, సుపరిపాలనను కోరుకుంటున్నారని, ఆ దిశగా సాగుతున్న తన ప ప్రచార పోస్టర్లను చింపేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారికి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తారని ఆమె తెలిపారు.