సరిహద్దుల్లో పటిష్టంగా నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దులలో పటిష్టంగా నిఘా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఆదేశించారు. నిఘా, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పన అంశాలపై ఎలాంటి వ్యత్యాసాలకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ వికలాంగులకు తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లతోపాటు ర్యాంపుల వంటి కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని చెప్పారు. సౌకర్యాల కల్పనలో ఎక్కడైనా లోపాలుంటే, అక్కడ 10 రోజుల లోగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె ఆదేశించారు. స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్స్, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మద్యం, నగదు, మాదకద్రవ్యాల రవాణాలను తనిఖీ చేయాలని చెప్పారు.
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తరచూ సందర్శించాలని, లోటు పాట్లుంటే వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి గానీ, జిల్లా ఎన్నికల అధికారికి గానీ తెలియజేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పర్యవేక్షణకు కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, ఆ వచ్చిన ఫిర్యాదులపై నియమ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఎన్నికల కోడ్ (ప్రవర్తనా నియమావళి) ఉల్లంఘనలు జరుగకుండా పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని, విధుల్లో అలసత్వం వహించేవారిపై ఎన్నికలసంఘం ఇచ్చిన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.