‘కోడిపందేల’పై బూర్గంపాడు పోలీసుల దాడి
నలుగురు అరెస్టు, 13 బైకులు స్వాధీనం, పలువురు పరార్
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో ఆదివారం (అక్టోబరు 15వ తేదీ) కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముసలిమడుగులో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో బూర్గంపాడు అదనపు ఎస్సై నాగభిక్షం, సిబ్బందితో కలిసి గాలించి, ఆ శిబిరం మీద దాడి చేశారు. ఈ సందర్భంగా పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి, లక్ష్మీపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి, టేకులపల్లి మండలం మద్రాసుతండా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. గుర్తు తెలియని మరికొందరు వ్యక్తులు పారిపోయారు. ఈ సందర్భంగా అక్కడ నలుగురు నిందితుల తోపాటు, 13 మోటారు సైకిల్స్, రూ.3200, 2 కోడిపుంజులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేయడంతోపాటు, పారిపోయిన మిగిలిన వారికోసం గాలిస్తున్నామని, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై నాగభిక్షం, ‘దివిటీ మీడియా’కు తెలిపారు.