Divitimedia
Spot News

కమీషన్ ఇవ్వలేదని కొత్తగా నిర్మించిన రోడ్డు తవ్వేసిన ఎమ్మెల్యే అనుచరులు

కమీషన్ ఇవ్వలేదని కొత్తగా నిర్మించిన రోడ్డు తవ్వేసిన ఎమ్మెల్యే అనుచరులు

నిందితులు తన అనుచరులు కాదన్న ఎమ్మెల్యే

✍🏽 దివిటీ మీడియా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ నుంచి బుదౌన్‌ను కలుపుతూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) నిర్మిస్తున్న కొత్త రహదారిని ఎమ్మెల్యే అనుచరులుగా చెప్తున్నవారు దాదాపు అర కిలోమీటరు మేర బుల్డోజర్లతో తవ్వినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ “కమీషన్” చెల్లించలేదనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్మాణసంస్థ మేనేజర్ రమేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 15 నుంచి 20 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారిలో ఒకరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కత్రా ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ ప్రతినిధి అని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసు నమోదైంది. తనను తాను ఎమ్మెల్యే ప్రతినిధిగా పరిచయం చేసుకున్న జగ్వీర్ సింగ్, నిర్మాణ సంస్థ ఉద్యోగులను పలు సందర్భాల్లో బెదిరించి, ఆ సంస్థ నిర్మాణ పనులు చేసేందుకు తమకు 5 శాతం కమీషన్ చెల్లించాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఆ మేరకు ”కమీషన్ ఇవ్వకపోవడంతో అక్టోబర్ 2న (సరిగ్గా గాంధీజయంతి రోజు) బుల్డోజర్లతో, తాము నిర్మించిన రోడ్డును అరకిలోమీటరు తవ్వారు’’ అని ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి)అశోక్ కుమార్ మీనా మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే సహాయకుడు “కమీషన్” ఇవ్వలేదని రోడ్డును తవ్వారని తెలిపారు.
జగ్వీర్ సింగ్ 15 నుంచి 20 మందితో రోడ్డు నిర్మాణ స్థలానికి చేరుకుని, అక్కడ పనిలో నిమగ్నమైన కార్మికులను కర్రలతో కొట్టారని, బుల్డోజర్లతో రోడ్డును అరకిలోమీటరు మేర తవ్వించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి పిడబ్ల్యుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తిల్హార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) ఆధ్వర్యంలో ఏర్పాటైన బృందం ఏర్పాటు చేసి సమగ్రసమాచారం కోరినట్లు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ పాండే
వెల్లడించారు. ఆ బృందం తన నివేదికను అందించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రోడ్డు నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించారని, ఆ కార్మికులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్‌ను విలేకరులు సంప్రదించగా, నిందితుడు జగ్వీర్ సింగ్ తన ప్రతినిధి కాదని, అతను బిజెపి కార్యకర్త మాత్రమేనని తెలిపారు.
“అతనితో నాకు సంబంధం లేదు” అంటూ కొట్టిపారేశారు.

Related posts

అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

Divitimedia

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పాల్వంచ ఎస్సై

Divitimedia

లోకేష్ పాదయాత్రకు బ్రాహ్మిణి శుభాకాంక్షలు…

Divitimedia

Leave a Comment