వైద్యాధికారికి సమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా కార్యకర్తలు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బూర్గంపాడు మండలంలోని ఆశా కార్యకర్తలు గురువారం మోరంపల్లిబంజర పి.హెచ్.సి వైద్యాధికారి డా.సాహితికి సమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. బూర్గంపాడు మండలంలో గురువారం నుంచి సమ్మెదీక్షలో పాల్గొనాలని కూడా నిర్ణయించారు. ఆశా కార్మికులుగా వెట్టిచాకిరీ బానిసత్వంగా పని చేస్తున్నామని, చాలీచాలని జీతాలతో మగ్గి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేలు వేతనంగా చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆశాకార్మికులు గ్రామాల్లో అనేక సర్వేలు చేస్తున్నారని, ప్రజారోగ్యానికి అంకితభావంతో ఉన్నతంగా సేవలందిస్తున్న విషయం గుర్తించాలని, డెంగ్యూ,మలేరియా తదితర వ్యాధులకు సంబంధించిన సర్వేలు చేస్తూ, ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు అందిస్తూ వారధిలాగా ప్రజలకి ప్రభుత్వానికి కట్టుబడి పనిచేస్తున్న ఆశ కార్మికుల వేతనం పెంచాలని కోరారు. కార్యక్రమంలో కనకం కృష్ణవేణి, ఇర్పా తారాదేవి, రత్నకుమారి, శ్రీవాణి, దుర్గ, కారం పద్మ, రమణ, మడకం కళావతి, రాజేశ్వరి, బాయమ్మ, సోయం నాగమణి, కళావతి, భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.