Divitimedia
Bhadradri KothagudemLife StyleTelangana

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశానికి రాష్ట్రం నుంచే కాక, ఇతర ప్రాంతాల నుంచి కూడా గణేష్ నిమజ్జనానికి భక్తులు వస్తుంటారని, వారికేమీ ఇబ్బంది కలగకుండా చూసుకోవలసిన బాధ్యత జిల్లా అధికారయంత్రాంగంపైనే ఉన్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డా ప్రియాంకఅల అన్నారు. భద్రాచలంలో మంగళవారం ఆమె వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రదేశాలను ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి ప్రతిక్ జైన్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, తదితరులతోపాటు కలిసి పరిశీలించారు. సుదూర ప్రాంతాల భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. పండుగ అయిన మూడోరోజు నుంచి వినాయకుడి విగ్రహాలను పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చివరి రోజు ఎక్కువమంది భక్తులొస్తున్నందున నిమజ్జన ప్రదేశంలో బారికేడ్స్ నిర్మించాలని, క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేసుకోవాలని, గోదావరి బ్రిడ్జి మీద నుంచి వచ్చే వాహనాలతోపాటు చర్ల, కూనవరం నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేసే చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులెవరూ గోదావరినదిలో దిగకుండా చూసుకోవాలని, ప్రతిచోట లైటింగ్ శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టంతో భక్తులందరికీ తెలియజేసే విధంగా సూచనలిస్తూ ఉండాలని ఆదేశించారు. ఐటిసి, సింగరేణి సంస్థలు ఏర్పాటు చేసిన క్రేన్లను సిద్ధంగా ఉంచుకోవాలని, వినాయక ప్రతిమలను భక్తులు రాకుండా క్రేన్లతో వారే స్వయంగా నిమజ్జనం చేసే విధంగా చూసు కోవాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్ సిబ్బంది ఆ పరిసరాలను శుభ్రం చేస్తూ ఉండాలని, అక్కడక్కడ డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులందరికీ స్వచ్ఛమైన మంచినీరందించాలని, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన శిబిరాలలో వారికి మంచినీళ్లతోపాటు అల్పాహారం అందేవిధంగా చూసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సిబ్బంది, ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపకశాఖ సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులోనే ఉండి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. భక్తులు వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, సురక్షితంగా గమ్యం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం స్పెషలాఫీసర్ నాగలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

గ్రూప్‌-3 పరీక్షలకు అంతా సిద్ధం : జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

Divitimedia

‘నేషనల్ స్పోర్ట్స్ డే’ సందర్భంగా ‘చలో మైదాన్”

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన ఓఎస్డీ, భద్రాచలం ఏఎస్పీ

Divitimedia

Leave a Comment