ఎడతెగని పోడు వివాదంలో ఉద్రిక్తత
గిరిజనులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు
జామాయిల్ చెట్టు పడి మహిళ మృతి
✍🏽 దివిటీ మీడియా – దమ్మపేట
రాష్ట్ర ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం పూర్తి చేసినట్లుగా ప్రకటించినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో పలుచోట్ల ఇంకా పోడు వివాదాలు కొనసాగుతున్నాయి. దమ్మపేట మండలం నాగుపల్లి ప్రాంతంలో కొంతకాలంగా పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. ఈపరిస్థితుల్లో పోడు వివాదం గిరిజనుల మధ్య చిచ్చు పెట్టింది. రెండు వర్గాలుగా విడిపోయిన గిరిజనులు పరస్పరం గొడవపడుతున్నారు. ఒక వర్గం వారు పోడు నరుకుతుండగా జామాయిల్ చెట్టు ఓ మహిళ మీద పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమె కుప్పకూలిపోయింది. ఆ మహిళను స్థానికులు, ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే ప్రాణం కోల్పోయింది. నాగుపల్లి ప్రాంతంలో పోడు భూమి వివాదం తమ ప్రాణాలమీదకు తెచ్చి పెడుతోందని, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని త్వరగా ఇక్కడి సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.