సచివాలయం ప్రాంగణంలో ఆలయం, మసీదు, చర్చి ప్రారంభోత్సవాలు
పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
చాలాకాలం తర్వాత రాజ్యాంగబద్ధంగా
తప్పనిసరి కాని ఓ అధికారిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ కలిసి పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయం ఆవరణలో పూర్తి చేసిన ఆలయం, మసీదు, చర్చి ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవాలు ఈ అరుదైన ఘట్టాలకు శుక్రవారం వేదికయ్యాయి. రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణం సమయంలో ఇక్కడ ఉన్న నల్లపోచమ్మ ఆలయం, చర్చి, మసీదులను తొలగించారు. దీంతో నూతన సచివాలయంలో తిరిగి ఈ మూడు ప్రార్థనా మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర సచివాలయానికి నైరుతిదిశలో నల్లపోచమ్మ ఆలయం నిర్మించారు. ఆలయంతో పాటుగా గణపతి, ఆంజనేయస్వామి, సుబ్రమణ్య స్వామి ఆలయాలు కూడా నిర్మించారు. ఆ ప్రాంగణంలో గతంలో ఉన్నస్థలంలో మసీదు కూడా నిర్మించి, మసీదులకు సమీపంలోనే చర్చిని కూడ నిర్మించారు. ప్రారంభోత్సవాల్లో భాగంగా నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ లు పాల్గొన్నారు.సర్వమత ప్రార్ధనల్లో కేసీఆర్, గవర్నర్ లు పాల్గొన్నారు. నల్లపోచమ్మగుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్, సీఎం, అనంతరం చర్చిని ప్రారంభించారు. చర్చిలో కేక్ కట్ చేశారు. తర్వాత మసీదు ప్రారంభించి ప్రార్ధనల్లో కూడా అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలతో పాల్గొన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గురువారం సీఎం కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. అప్పుడే
సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయంలో ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవంలో కూడా పాల్గొనాలని గవర్నర్ ను ఆహ్వానించారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆహ్వానించడం వల్ల శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణసచివాలయంలో జరిగిన ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. చాలా కాలం నుంచి ప్రచ్ఛన్న ఆధిపత్యపోరాటం చేస్తూ, ఎడమొహం పెడ మొహంగా ఉన్న గవర్నర్, సీఎం ఇలా ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.