విలువలతో కూడిన ప్రజోపయోగ జర్నలిజం సాగించాలి
పాత్రికేయులకు పిఐబి ‘వార్త లాప్ – వర్క్ షాప్’లో ప్రముఖులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
పాత్రికేయులందరూ విలువలు, విషయ పరిజ్ఞానంతో కూడిన ప్రజోపయోగకరమైన జర్నలిజం సాగించాలని పలువురు ప్రముఖ అధికారులు, వివిధ రంగాల నిపుణులు సూచించారు. కొత్తగూడెంలో గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరపున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి), హైదరాబాదు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వార్త లాప్- వర్క్ షాప్’లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక ఇల్లందు గెస్ట్ హౌస్ లో జరిగిన వర్క్ షాప్ ను సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్.బలరామ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత విలేకరుల కోసం ప్రత్యేక ఆసక్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కోరిన వెంటనే తమ వంతుగా సహకారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పని ఒత్తిడి వల్ల బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నందుకు పాత్రికేయ సోదరులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సింగరేణి అభివృద్ధిలోనూ పాత్రికేయుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి(డిఆర్ఓ) ఎం.వి. రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలకు, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మీడియా పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. సంక్షేమ పథకాల తీరులో లోటుపాట్లు సరిదిద్దుకునే విధంగా ప్రభుత్వాలకు తెలియజేసేది మీడియా అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికార యంత్రాంగానికి తెలియజేస్తూ, ఆ పథకాల అమలుతీరు ఖచ్చితంగా ఉండేలా మీడియా చేస్తుందన్నారు. దశాబ్దం క్రితం ప్రింట్ మీడియాలో వచ్చే వార్తల పట్ల చాలా ప్రాముఖ్యం ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయిందన్నారు. అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కరించే సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టాలన్నారు. నిజమో? కాదో? నిర్దారణ అయ్యే వరకు ఫేక్ న్యూస్ కూడా వాస్తవంలాగానే ఉంటుందని, ఫేక్ న్యూస్ పట్ల అందరూ అప్రమత్తంగానే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఐబి హైదరాబాదు శాఖ జాయింట్ డైరెక్టర్ వి.బాలకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణ కాంత్ మాట్లాడారు. భారత ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పట్టణ, గ్రామీణ పాత్రికేయుల్లో వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విషయ నిపుణులతో పిఐబి ప్రత్యేక వర్క్ షాప్ లు నిర్వహిస్తూ పలు అంశాలపైన అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తోందని, కేంద్రప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు, మీడియాకు చేర వేయడంలో తమ పిఐబి ముఖ్య పాత్రను పోషిస్తోందని జాయింట్ డైరెక్టర్ బాలకృష్ణ తెలిపారు. మీడియా విలువలు, అభివృద్ధి జర్నలిజం అనే అంశాలపై రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు మాట్లాడారు. జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ, ఖచ్చితమైన వార్తలను సేకరించి, ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని కోరారు. వార్తలు రాసే ముందు నిర్దారణ చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. మరో వక్త సి డాక్ సైంటిస్ట్ జగదీష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ డిజిటల్ యుగంలో కేవలం వార్తలే కాకుండా, సమాచార సేకరణ కోసం వినియోగించే మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల భద్రత చూసుకోవాలన్నారు. ఆ పరికరాల సాఫ్ట్ వేర్ తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలని, ఈ సైబర్ యుగంలో డేటాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగానే పిఐబి పనితీరు గురించి హైదరాబాదు శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డిడి) మానస్ కృష్ణకాంత్ పి.పి.టి ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు చెందిన సిబిసి అధికారి కోటేశ్వరరావు, పిఐబి అధికారి శివచరణ్ రెడ్డితోపాటు, పిఐబి అధికారులు కూడా పాల్గొన్నారు.