బీసీ బంధు తోడ్పాటుతో బీసీల అభివృద్ధి
కొత్తగూడెంలో బీసీలకు రూ.3కోట్ల సాయం పంపిణీ
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
బీసీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బీసీ బంధు’ పథకం తోడ్పడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కొత్తగూడెం క్లబ్బులో బీసీ బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు 300 మందికి రూ.3 కోట్ల సాయం చెక్కులు రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల అభివృద్ధికిది ఆరంభం అని చెప్పారు. తొలి విడతలో కొత్తగూడెం నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, మలివిడతలో మరొక వెయ్యి మందికి ఆర్థిక సాయమందించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా తెలిపారు. పథకం అమలుతో బీసీ కులాల లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధి సాధనకు అవకాశమేర్పడుతుందని, ప్రతి ఒక్కరు ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ బీసీ కులవృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నవారి అభివృద్ధికి ఇదొక మంచి పథకమని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు విడతలవారీగా ఈ పథకం అమలు జరుగుతుందని చెప్పారు. ఎంపిక కాబడిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పథకంలో ఆర్థికసాయం అందుకున్న లబ్ధిదారులు కులవృత్తులను ప్రారంభించాలని చెప్పారు.
ఈ సందర్భంగా
చుంచుపల్లి మండలం పరిధిలో 45 మంది, కొత్తగూడెం మున్సిపాలిటీలో 68 మందికి, లక్ష్మీదేవిపల్లిలో 42 మందికి, పాల్వంచలో 22 మందికి, పాల్వంచ మున్సిపాలీటీలో 66 మందికి, సుజాతనగర్ మండలంలో 42 మందికి ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశారు. మరో 10 మందికి గతంలో సంక్షేమ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, స్థానిక కౌన్సిలర్ ధర్మరాజు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.