Divitimedia
Spot News

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

‘పాత పెన్షన్ స్కీమ్’ పునరుద్ధరించండి…

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

భారత్ బంద్ సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

హామీలేని జాతీయ పెన్షన్ విధానం (ఎన్ పీఎస్) రద్దుచేయడంతోపాటు నిర్వచించబడిన, హామీ ఇవ్వబడిన పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, వేలాదిమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ ఉద్యోగులు, పెన్షనర్లు ఢిల్లీలో గురువారం ‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఎన్.జె.సి.ఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన బహిరంగసభ జరిపారు. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని నో పెన్షన్ స్కీమును రద్దు చేయాలని నినదించారు. ఎన్పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా మారినందు వల్ల ఓపీఎస్‌ ను పునరుద్ధరించమనడం న్యాయబద్ధమైన కోర్కె అని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ ఉపాధ్యక్షులు వి.కృష్ణ మోహన్ ఈ సందర్భంగా తెలిపారు.
2004 జనవరి 1న, ఆ తర్వాత నియమించబడిన ఉద్యోగులకు అమలు చేస్తున్న ఎన్పీఎస్ ను ఉపసంహరించుకుని, వారందరినీ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని, పి.ఎఫ్.ఆర్.డి.ఏ ని రద్దు చేసి దానిలో ప్రతి నెలా జమ చేయబడ్డ 10 శాతం బేసిక్ పే, డి.ఏ, జీపిఎఫ్ పధకాన్ని అమలు చేసి దానిలో జమ చేయాలని డిమాండ్ చేశారు. పి.ఎఫ్.ఆర్.డి.ఏ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు 2004 నుంచి పి.ఎఫ్.ఆర్.డి.ఏ కి అందించిన విరాళాలను తిరిగి పాత పెన్షన్ స్కీమ్‌కి మారాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నాయని వాపోయారు. పెన్షన్ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, పింఛను బహుమతి కాదని, అది వారి జీవితంలో ఉచ్ఛస్థితిలో యజమాని కోసం నిరంతరం శ్రమించిన వారికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించే సామాజిక సంక్షేమ చర్య అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం తన సొంత ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కృష్ణమోహన్ విమర్శించారు.
సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి, యస్.యస్.బి, ఎన్.ఎస్.జి, అస్సాం రైఫిల్స్, తదితర సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సి.ఎ.పి.ఎఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీముకు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఓపీఎస్‌ అమలు చేయడానికి తిరస్కరించటం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు. అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్టపోయారని, భారతదేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వి.కృష్ణమోహన్ హెచ్చరించారు.

Related posts

రుణమాఫీపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం

Divitimedia

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి

Divitimedia

సంవత్సరంలోపే సమస్యలన్నింటికీ పరిష్కారం

Divitimedia

Leave a Comment