దూరవిద్య ద్వారా ఉన్నత చదువులకు అవకాశం
ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
భద్రాచలంలో విస్తృతంగా ప్రచారం
✍🏽 దివిటీ మీడియా-భద్రాచలం
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించవచ్చని తెలియజేస్తూ సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ శ్రీనివాస యాదవ్ ను కలిసి, ఆయనతో ఓపెన్ స్కూల్ గోడ పత్రిక ఆవిష్కరింపజేశారు. దీంతోపాటు అక్కడే ఆయన సమక్షంలోనే గృహలక్ష్మి దరఖాస్తుల సమర్పించేందుకు వచ్చిన మహిళలందరికీ అడ్మిషన్ల గురించి తెలియజేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకల సందర్భంగా బుధవారం భద్రాచలంలో ఆదివాసిలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, చదువు ఆవశ్యకత తెలియజేశారు. అనేక కారణాల వల్ల చదువుకు దూరమైన వాళ్లు, ఉన్నత చదువులు కొనసాగించాలనే కోరిక ఉన్నా వ్యక్తిగత కారణాలవల్ల చదువుకోలేని వాళ్లు ఓపెన్ స్కూల్ ద్వారా పదవతరగతి,ఇంటర్ చదువుకోవచ్చని వివరించారు. ఈ ఓపెన్ స్కూల్ విధానంలో చదువు మధ్యలో ఆపిన వారు మరలా చదువుకునేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విధానంలో 14 సంవత్సరాలు నిండినవారంతా పదవ తరగతి, 15 సంవత్సరాలు నిండిన వారు ఇంటర్ విద్యను పూర్తి చేయవచ్చని ఆయన వెల్లడించారు. ఈ దూరవిద్యా విధానంలో చదువుకోవడం రెగ్యులర్ విద్యాభ్యాసంతో సమానమని, ప్రభుత్వం దూరవిద్య స్కూల్ లను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. పదవ తరగతి చదువుకున్న తర్వాత దూర విద్యలో ఇంటర్ కూడా ఒక సంవత్సరమే చదువుకొని పాసయ్యే అవకాశం ఉందని, చదువుకోవాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం ఐదు సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, 10వ తరగతి పూర్తిచేయవచ్చునని ఆయన తెలియజేశారు. అడ్మిషన్ విధానం గురించి వివరించారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నమెంట్ హైస్కూల్ లోని భద్రాచలం ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ బి.నీరజ, అసిస్టెంట్ కోఆర్డినేటర్ యస్.వి.రమణ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.