‘ఆరోగ్య బీమా’ కేసులో వినియోగదారుని విజయం
✍️దివిటీ (ఖమ్మం) ఆగస్టు 28
ఆరోగ్యబీమా పథకం పాలసీ తీసుకున్న అనారోగ్య బాధిత వినియోగదారునికి ఏడు శాతం వడ్డీతో బీమా పరిహారంతో పాటు, వేదనకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల నిమిత్తం మరో రూ.10 వేలు చెల్లించాలని ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్ పర్సన్ వి.లలిత, సభ్యులు ఎ.మాధవీలత తీర్పునిచ్చారు. కేసుకు సంబంధించి బాధితుల న్యాయవాదులు మల్లంపాటి అప్పారావు, వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, కొలికొండ శరత్ బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఫిర్యాదుదారు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చంద్రుపట్ల గ్రామానికి చెందిన కాటమనేని రాజేశ్వరరావు ఆంధ్రా బ్యాంకు, మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తన కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ ఆరోగ్యబీమా పథకం పాలసీ తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో రూ.12,579 ప్రీమియమ్ చెల్లించి, రూ.4లక్షల పరిమితి గల క్యాష్ లెస్ పాలసీ తీసుకున్న కొద్ది కాలానికి దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలయ్యారు. వైద్యులు పరిశీలించి ఖమ్మం పట్టణంలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారని ఫిర్యాదుదారు ఈ కేసులో పేర్కొన్నారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఆసుపత్రిలో వైద్యానికి అయిన ఖర్చులు చెల్లించాలని ఇన్సూరెన్స్ సంస్థను ఆశ్రయించారు. ఆ బీమా క్లెయిమ్ చెల్లించేందుకు ఆ బీమా సంస్థవారు నిరాకరించారని తెలుపుతూ, ఖమ్మంజిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కు న్యాయవాదుల మల్లంపాటి అప్పారావు, వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్, కొలికొండ శరత్ బాబు ద్వారా నివేదించారు. కాగా ఈ కేసును పరిశీలించిన కమిషన్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం బాధితులకు వైద్యం అవసరమైన సమయంలో చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. షదరు ఫిర్యాదుదారుకు అయిన వైద్యఖర్చులు రూ.2,27,284 ఏడు శాతం వడ్డీతో చెల్లించాలని, మనో వేదనకు గురిచేసినందుకు రూ.10వేలు, ఖర్చుల నిమిత్తం మరో రూ.10వేలు కూడా కలిపి 45 రోజుల లోపు సదరు ఫిర్యాదుదారుకు చెల్లించాలని ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారకమిషన్ తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారుని తరపు న్యాయవాదులు మల్లంపాటి అప్పారావు, వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్, కొలికొండ శరత్ బాబు జిల్లా కమిషన్ లో ఈ కేసు నమోదు చేసి, వాదనలు వినిపించారు.