Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadInternational NewsLife StyleSpot NewsTechnologyTelanganaYouth

సైబర్ నేరాల్లో 13మంది యువకులు అరెస్టు

సైబర్ నేరాల్లో 13మంది యువకులు అరెస్టు

ఆరు నెలల్లో 60 కరంట్ అకౌంట్లతో రూ.8.5కోట్ల అక్రమ నగదు లావాదేవీలు

వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 25)

ఆరు నెలల కాలంలో నకిలీ పత్రాలతో బ్యాంకుల్లో కరంట్ అకౌంట్లు తెరిచి, భారీ మొత్తంలో రూ.8.50కోట్ల మేరకు అక్రమ లావాదేవీలు చేసిన 13మంది వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం… రెండు రోజుల క్రితం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన ఫిర్యాదుల మేరకు టేకులపల్లి పోలీసులు, జిల్లా సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు సంయుక్తంగా ఆ నిందితులను పట్టుకున్నారు. ఆదివారం (ఆగస్టు 24) మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో టేకులపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. టేకులపల్లి మండల కేంద్రంలో మీసేవ కేంద్రాన్ని నడుపుతున్న బోడా శ్రీధర్ అనే వ్యక్తికి టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు, ఇతరులకు నగదు బదిలీ చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. అతనితో పాటుగా టేకులపల్లి మండలానికి చెందిన మరో 12మంది చదువుకున్న యువకులు నకిలీ పత్రాలతో బ్యాంకులలో 60 కరెంట్ అకౌంట్లను తెరిచారు. ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపిస్తూ కమీషన్లు పొందుతూ వారందరూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. గడిచిన ఆరు నెలల నుంచి ఈ విధంగా మొత్తం రూ.8.5కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్ ఒకటి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా వీరి బ్యాంక్ ఖాతాలపై 108 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. ఈ కేసులో పట్టు బడిన వ్యక్తులను టేకులపల్లిలో ఇంటర్ నెట్ సెంటర్ నిర్వాహకుడు బోడా సుధీర్, అదే గ్రామానికి చెందిన బోడా రాజేష్,
బోడా రాజన్న, బోడా జంపన్న, పోలె పొంగు పవన్ కల్యాణ్, ఊరిమళ్ల భరత్ కృష్ణ, బానోతు జగదీష్ (సింగ్యా తండా), తేజావత్ నరేష్ (బిల్లుడు తండా), భూక్యా వీరన్న (బద్దు తండా), జాటోత్ నరేష్ (పాత తండా), బోడా రాజారాం (రాంపురం తండా), భూక్యా ప్రవీణ్ (బద్దుతండా), మాలోత్ ప్రవీణ్ (మద్దిరాల తండా) అనేవారుగా ఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన ఈ 13మంది వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఇల్లందు కోర్టుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సైబర్ నేరం కేసులో టేకులపల్లి సీఐ బి.సత్యనారాయణ, ఎస్సై ఎ. రాజేందర్, సైబర్ క్రైమ్ సీఐ ఎస్.జితేందర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వివిధరకాలుగా అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు కాజేయాలని చూస్తున్నారని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యక్షంగా నైనా, పరోక్షంగానైనా ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సైబర్ నేరానికి గురై నగదు కోల్పోయిన వారు ఎవరైనా వెంటనే 1930 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే కోల్పోయిన నగదు తిరిగిపొందే అవకాశం ఉంటుందని ఎస్పీ
ఈ సందర్భంగా సూచించారు.

Related posts

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణపై మంత్రి పొంగులేటి ఆగ్రహం

Divitimedia

పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Divitimedia

Leave a Comment