నాణ్యమైన విద్యనందించాలి : జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ మణుగూరు – దివిటీ (ఆగస్టు 22)
విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యనందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మణుగూరులోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, వసతిగృహాలు, పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. అక్కడున్న హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, మంచాలు, దుప్పట్లు, స్నానాల గదులు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
తరగతి గదులు సందర్శించి, చదువుపై విద్యార్థులకున్న ఆసక్తి, ఉపాధ్యాయుల బోధన నాణ్యత, అభ్యాసనస్థాయిలపై సమీక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసు కోవాలని, ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనతోపాటు పోటీపరీక్షల శిక్షణ కూడా అందించాలని సూచించారు. భోజనశాల పరిశీలించి ఆహారపదార్థాల నిల్వ తీరు, వంటశాల శుభ్రత, విద్యార్థులకందిస్తున్న భోజన నాణ్యతను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. తాజా పదార్థాలతోనే వంటచేయాలని, ఆహారం పోషకాలతో, రుచికరంగా ఉండేలా జాగ్రత్త పడాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రతిభ కనబర్చేలా అవకాశాలు కల్పించాలన్నారు. అక్కడి సమస్యలపై నివేదికలు అందించాలని, తక్షణమే పరిష్కారం చూద్దామని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.