ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలందించాలి

వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి
కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్
✍️ కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు. 21)
ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యశాఖ అధికారులను జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశించారు. గురువారం కొత్తగూడెంలో ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో మందులు అందించే గది, రక్త పరీక్షకేంద్రం, ఇన్ పేషెంట్, గర్భిణుల వార్డులు, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఇన్ పేషెంట్ వార్డులో రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషెంట్ల, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకందిస్తున్న సేవలగురించి ఆరాతీసి సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. కుక్కకాటుకిచ్చే వ్యాక్సిన్ వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని,, ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఔషధాల నిల్వలు పెట్టుకోవాలన్నారు. రోగులకు శుచికరమైన, బలవర్ధకమైన ఆహారమివ్వాలని ఆయన సూచించారు. వైద్యులు, సిబ్బంది సంఖ్య తెలుసుకుని, సమస్యలపై ఆరా తీశారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. తనిఖీలో కలెక్టర్ వెంట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.రాధామోహన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.