సమస్యలు పరిష్కరించాలని ఆశావర్కర్ల ధర్నా
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 19)
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర పి.హెచ్.సి వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ కన్వీనర్ పాండవుల రామనాథం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్.లక్ష్మీసాహితికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అంద జేశారు. రామనాథం మాట్లాడుతూ, ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. 2023 సెప్టెంబరులో 15 రోజులు సమ్మె చేసిన తర్వాత గత ప్రభుత్వం రాష్ట్ర నాయకులను పిలిచి ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకపోగా వారి ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి సంబంధంలేని బాధ్యత లేని పనులను చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆశాలకు నెలకు రూ.18వేల చొప్పున పారితోషికం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా ఆయనన్నారు. జులై,ఆగస్టు నెలల పెండింగ్ వేతనాలు కూడా ఆగస్టు నెలాఖరులో ఇవ్వాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆశావర్కర్స్ బుచ్చమ్మ, తారాదేవి, సుగుణ, తోకల రత్నకుమారి, బాయమ్మ, భారతి, నాగమణి, వెంకట రమణ, సీత, తిరుపతమ్మ, విజయ తదితరులు పాల్గొన్నారు.

==========
మధిర ప్రభుత్వాసుపత్రి ముందు ఆశావర్కర్ల ధర్నా
==========
తమ సమస్యలను పరిష్కరించాలని, ఈ నెల 25న ఖమ్మంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని ఆశా కార్యకర్తలు మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. సీఐటీయు మధిర పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మాట్లాడుతూ, తమకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈసీఐ సౌకర్యాలతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని, తమ డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా నాయకుడు తేలప్రోలు రాధాకృష్ణ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.