ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన
✍️ ఇల్లందు – దివిటీ (ఆగస్టు 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రూ.22కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. టేకులపల్లి మండలంలో పలు బీటీ రహదారులు, స్లాబ్ కల్వర్ట్, హై లెవల్ వంతెనల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇల్లందు మండలంలో హైలెవల్ వంతెన, మినీ స్టేడియం అభివృద్ధి, ప్రధాన రహదారి విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా రహదారులు, వంతెనలు, క్రీడా మైదానాల వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలకు శాశ్వత సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, ఇల్లందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్ నాయక్, కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్.అండ్.బి ఈఈ వెంకటేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.