చోరీ కేసుల నిందితుడి అరెస్ట్
రూ.155గ్రాముల బంగారం రికవరీ
✍️ ఖమ్మం – దివిటీ (జులై 10)
ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్ కు చెందిన నిందితుడు, చోరీలకు అలవాటు పడిన పాత నేరస్తుడు దొన్వాన్ ప్రేమ్ కుమార్ ను ఖమ్మం 2టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7.5 లక్షల విలువ గల 155 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా రికవరీ చేసినట్లు ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. నిందితుడు కొన్నేళ్ల నుంచి పలు ఇళ్ళల్లో చోరీలు చేస్తూ, అనేకసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తెలిపారు. ఈ సంవత్సరం జనవరిలో కూడా ఖమ్మం టూ టౌన్ పరిధిలోని మామిళ్లగూడెం వెంకటేశ్వర స్వామి గుడిలో డబ్బు చోరీ చేశాడని వెల్లడించారు. ఖమ్మం ద్వారకానగర్లోని ఓ ఇంట్లో రాత్రిపూట దొంగతనం చేసి బంగారు వస్తువులు దొంగిలించాడని చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ లో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ఓ వ్యక్తి నడిచి వెళ్తుండగా అతని నుంచి రెండు బంగారు ఉంగరాలు దొంగిలించాడని వెల్లడించారు. ఫిబ్రవరిలో ఖానాపురం హవేలీ పరిధిలోని వరదయ్యనగర్లోని ఒక అపార్ట్ మెంట్లో బంగారు వస్తువులు దొంగిలించాడని సీఐ బాలకృష్ణ వివరించారు.