కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం

మోరంపల్లిబంజరలో కార్యకర్తలతో సమావేశం

✍️ బూర్గంపాడు – దివిటీ (మే 3)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తహసిల్దార్ కార్యాలయంలో శనివారం బూర్గంపాడు మండలానికి చెందిన 105మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు, బూర్గంపాడు మండలానికి కోట్ల నిధులు సమకూర్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, ధాన్యానికి రూ.500 బోనస్ వంటి అనేక పథకాలు అమలు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని ఎండల్లో బయట తిరగొద్దని ఆయన కోరారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. అంతకుముందు మోరంపల్లిబంజరలో మాజీ ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తేనీటివిందు సమావేశంలో కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, బూర్గంపాడు మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.