దోమలవాగు చెరువు రిజర్వాయర్ గా తీర్చిదిద్దాలి
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన ఆయకట్టు రైతులు
✍️ బూర్గంపాడు, మణుగూరు – దివిటీ (ఏప్రిల్ 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తలమానికం అయిన సీతారామప్రాజెక్టుకు బూర్గంపాడు మండల పరిధిలోని “దోమలవాగు చెరువు” అనుసంధానం చేసి మినీ రిజర్వాయర్ గా తీర్చిదిద్దాలని ఆయకట్టు రైతులు, కాంగ్రెస్ నాయకులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయనను బూర్గంపాడు మండల రైతులు కలిశారు. దోమలవాగు పరిధిలోని టేకులచెరువు, లక్ష్మీపురం, సంజీవరెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లిబంజర, అంజనాపురం, నకిరిపేట, గోపాలపురం, పోలవరం, కొమ్ము నకిరిపేట, వేపలగడ్డ గ్రామాల్లో దాదాపు 1405 ఎకరాల వ్యవసాయ భూములకు లబ్ధిచేకూరుతుందని వారు ఎమ్మెల్యేకు వివరించారు. దీనివల్ల రైతు కుటుంబాలు బాగుపడతాయని మండల రైతులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు విన్నవించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు మేలు చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం
అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. త్వరలోనే రైతులు కోరుకుంటున్న ఈ దోమలవాగు వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రైతుల కోరిక తీరేలా కృషిచేస్తానన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై సంబధిత అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే రైతులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.