రాష్ట్ర రాజధానిలో రాజకీయ వేడి
భూముల పరిశీలనకు హైదరాబాదు చేరిన సుప్రీం కమిటీ
✍️ హైదరాబాదు – దివిటీ (ఏప్రిల్ 10)
హైదరాబాదు కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వ్యవహారంలో క్షేత్ర స్థాయి పరిశీలన కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ గురువారం హైదరాబాదు చేరుకుంది. ఈ భూముల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల హెచ్ సి.యు (హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) విద్యార్థి వర్గాల నిరసన, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో పర్యావరణ హాని జరుగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో విషయం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు చేరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారం పరిశీలనకు కమిటీని ఏర్పాటుచేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ ప్రత్యేక కమిటీ చర్యలు ఆరంభించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సాయంత్రం 7-45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చింది. గురువారం కమిటీ గచ్చిబౌలి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, పరిస్థితులు అధ్యయనం చేసి, ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భూములపై అవాస్తవాలు ప్రచారం చేశారంటూ ప్రభుత్వం కొందరు వ్యక్తులు, రాజకీయనాయకులపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ పర్యటన పట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.