ఏపీ, తెలంగాణ మధ్య ‘జల జగడం’…
ఏపీ సర్కారుపై సుప్రీంలో పిటిషన్ యోచనలో తెలంగాణ
✍️ హైదరాబాదు, అమరావతి – దివిటీ (ఏప్రిల్ 5)
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ‘జల జగడం’ తీవ్రతరమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ, దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితేర్పడింది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ, అడ్వకేట్ జనరల్‌తో చర్చించిన మీదట తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి అనుమతులేమీ తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఉంటే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోబోమని ఆయన తేల్చి చెప్పారు.
ఏపీ ప్రభుత్వం బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అక్రమంగా నిధులు తెచ్చి, నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించనుందన్నారు.
చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఏపీ కోసమే వ్యవహరిస్తున్నారని, బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రజల తరుపున పోరాడి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.