శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి పటిష్ట చర్యలు

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగవు : ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 3)
భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసుశాఖ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మండపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్లను భక్తులు సులభంగా కనుగొని, అక్కడికి చేరుకునే విధంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఒక QR కోడ్, ఆన్లైన్ లింక్ రూపొందించినట్లు ఎస్పీ వెల్లడించారు. https://bhadrachalam.netlify.app ఆన్లైన్ లింక్ ద్వారా నవమి, పట్టాభిషేక మహోత్సవాల్లో భద్రాచలంలో భక్తులు సులభంగా వారు వెళ్లాల్సిన స్థలాలకు చేరుకోవచ్చునని తెలిపారు. దాదాపుగా 2000 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులందరూ ఏర్పాట్లు సద్వినియోగం చేసుకుని పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఉత్సవాల్లో ఆ రెండు రోజులపాటు భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు విధించే ఆంక్షలకు భద్రాచలం పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.