హైదరాబాదులో పలుచోట్ల భారీవర్షాలు
అకాలవర్షాల పరిస్థితులకు సంసిద్ధంగా ఉండాలి
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
✍️ హైదరాబాదు – దివిటీ (ఏప్రిల్ 3)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలుచోట్ల గురువారం భారీగా అకాలవర్షాలు కురిసాయి. భారీస్థాయిలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో వర్షపాతం భారీగా నమోదైంది. హిమాయత్‌నగర్‌లో 7.5 సె.మీ., చార్మినార్‌లో 7.2 సెం.మీ.,
షేక్‌పేట్‌లో 7.1సెం.మీ., బాలానగర్‌లో 7 సెం.మీ. అంబర్‌పేట్‌లో6.8 సెం.మీ., ముషీరాబాద్‌లో 6.3సెం.మీ. వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఇంకా అనేక చోట్ల కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసాయి. మరోవైపు అకాలవర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల వల్ల తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలెవరూ ఏ ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయకచర్యలకోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నగరంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగినచర్యలు తీసుకుని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. విద్యుత్తు సరఫరాలో ఏ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా, తదితర అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్య పరిష్కరించి, సరఫరా పునరుద్ధరించాలని చెప్పారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు కూడా క్షేత్ర స్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.