గొమ్మూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 31)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రాచీన గొమ్మూరు ఈద్గాలో ముస్లింసోదరులు పెద్ద సంఖ్యలో, భక్తిశ్రద్ధలతో సోమవారం ఈద్-ల్-ఫితర్ నమాజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మతగురువు మాట్లాడుతూ, రంజాన్ నెలలో ఖురాన్ గ్రంథం ఆవిష్కరించిందన్నారు. ఈనెల 1000 నెలల్లో చేసుకున్న పుణ్యాలతో సమానమని, అతి పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరూ అతి కఠోర ఉపవాస దీక్ష చేసి తమ పాపాల నుంచి విముక్తికోసం అల్లాను ప్రార్థిస్తారని అన్నారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, నమాజు, రోజా,ఫిత్రా, జకాత్, మరియు విరివిగా దానధర్మాలు చేయాలన్నారు. పరమత సహనాన్ని పెంపొందించాలని, అందరితో సోదరభావంతో మెలగాలని, జాలి, కరుణ, దయ చూపించాలన్నారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కేంద్ర కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు విషయంలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ ఈద్ నమాజులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ సభ్యులు, మత గురువు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.