ఇకనుంచి వాళ్లు కూడా ‘హాఫ్ నిక్కర్లు’ కాదు
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
✍️ హైదరాబాదు, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 30)
తెలంగాణ పాఠశాలల్లో ఇకనుంచి 6వ, 7వ తరగతుల విద్యార్థులకు కూడా నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు ధరించేలా అవకాశం లభించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇ.వి.నర్సింహారెడ్డి రాష్ట్ర సెర్ప్ సీఈఓకు లేఖ రాశారు. ప్రభుత్వం విద్యార్థులకోసం ‘డ్వాక్రా మహిళా సంఘాల’ ద్వారా ‘యూనిఫామ్స్’ కుట్టించి ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం యూనిఫామ్ లో ప్యాంట్లు ఇచ్చేది. 7వ తరగతిలోపు వారికి కేవలం నిక్కర్లు మాత్రమే ఇచ్చేవారు. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. యూనిఫామ్స్ కుట్టే డ్వాక్రా మహిళా సంఘాల వారికి ఆ కొలతల ప్రకారం యూనిఫామ్ కుట్టేలా ఆదేశాలు జారీచేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నర్సింహారెడ్డి సెర్ప్ సీఈఓను కోరారు. అందుకోసం అవసరమైన అదనపు ‘క్లాత్’ను ప్రభుత్వం సరఫరా చేయనుంది.

