గిరిజన మ్యూజియం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
✍️ హైదరాబాదు, భద్రాచలం- దివిటీ (మార్చి 26)
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పునర్నిర్మితమైన గిరిజన మ్యూజియం ఏప్రిల్ 6న వైభవంగా ప్రారంభం కానుంది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏపీవో డేవిడ్ రాజు బుధవారం అధికారికంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మ్యూజియం గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి సంస్కృతి, వారసత్వ సంపదను కొత్త తరాలకు పరిచయం చేసేలా ఓ అద్భుత వేదికగా రూపుదిద్దుకుందని అధికారులు చెప్తున్నారు. ఆధునిక సదుపాయాలతో, ప్రత్యేక కళాకృతులతో ఈ మ్యూజియం గిరిజన సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ముస్తాబవుతోందని తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవానికి సీఎం హాజరుకానుండటం గిరిజనులకు ఎంతో గర్వకారణమన్నారు. భద్రాచలం సందర్శించే పర్యాటకులకు మ్యూజియం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని, గిరిజన జీవనశైలి, సంప్రదాయాలను సమగ్రంగా పరిచయం చేస్తుందని అధికారులు తెలిపారు. సీఎంకు ఆహ్వాన పత్రిక అందించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రమంత్రులు, ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన శాసనసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.