Divitimedia
Bhadradri KothagudemBusinessDELHIHyderabadInternational NewsKhammamLife StylePoliticsSpot NewsTelanganaTravel And Tourism

కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై మళ్లీ కదలిక

కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై మళ్లీ కదలిక

20న ప్రత్యామ్నాయ స్థల పరిశీలనకు కేంద్ర బృందం

కొత్తగూడెం వద్ద పలు ప్రాంతాల్లో పరిశీలనలు

ఏఏఐ బృందం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 10)

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు అంశంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అంశంపై మరోసారి కదలిక వచ్చింది. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకోసం ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు ఈ నెల 20న ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు పర్యటిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా వెల్లడించారు. ఇటీవల తాను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని కోరినట్లు తుమ్మల తెలిపారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన గతంలో సూచించిన కొత్తగూడెం పరిసర ప్రాంతంలోని భూములు అనుకూలంగా లేవనే కారణంతో కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లోని పలు చోట్ల భూములను గుర్తించామని, మరోసారి సర్వే నిర్వహించాలని కోరుతూ ఇటీవల తాను కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి లేఖ రాసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ లేఖకు కేంద్ర మంత్రి బదులిస్తూ, ఎయిర్ పోర్టు నిర్మాణానికి పరిశీలనకు ప్రత్యేక బృందం రావాల్సి ఉంటుందని, అందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని లేఖలోపేర్కొన్నట్లు తుమ్మల వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్వయంగా కలిసి అంశాన్ని వారికి వివరించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై స్పందించిన సీఎం సర్వేకోసం అవసరమయ్యే నిధులు కేటాయిస్తూ ఓ ప్రత్యేక జీఓ విడుదల చేశారని, దీనిపైన తాను మరోసారి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖలో వివరించి, త్వరగా ఆ సర్వే నిర్వహించేలా చూడాలని కోరినట్లు తుమ్మల వివరించారు. జిల్లాలో ఎయిర్ పోర్ట్ కు అనువైన స్థలం ఎంపిక చేయడం కోసం పలు ప్రాంతాలను గుర్తించామని, ఆ భూముల్లో సర్వేతో సాధ్యాసాధ్యాలు నిర్ధారించేలా చొరవ చూపాలని కోరినట్లు కూడా మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ స్థలాల పరిశీలన, ఎంపికల గురించి, ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మంత్రులిద్దరి కృషితో కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కలలు సాకారమైతే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మరింత అభివృద్ధికి దోహదపడనుంది.
——————-
20న ఏఏఐ ప్రత్యేక బృందం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు : మంత్రి తుమ్మల
——————-
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఈ నెల 20న వస్తున్న ప్రత్యేక బృందం పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూడాలని జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగూడెం పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే జిల్లా రూపురేఖలు మారనున్నాయన్నారు. ఇప్పటికే కొత్తగూడెం పాల్వంచ కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వాణిజ్యం, పర్యాటక, పారిశ్రామికపరంగా మరింత అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంతో పాటు సింగరేణి గనులు, పరిశ్రమలకు నెలవైన జిల్లాకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు సైతం వచ్చేందుకు ఎయిర్ పోర్ట్ దోహదపడుతుందన్నారు. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం మరవలేనిదని తుమ్మల పేర్కొన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని, ఎయిర్ పోర్టుకు కావలసిన భూములు గుర్తించే విషయంలో సహాయ సహకారాలు అందించారన్నారు. అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Related posts

అధికారిక దోపిడీపై చర్యలు లేవా?

Divitimedia

‘ఒక్కరి’ కోసం… డిపార్ట్ మెంట్ నే ‘బలి చేస్తున్నారు…’.

Divitimedia

నర్సరీ ఆధునీకరణ ప్రణాళికలకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు

Divitimedia

Leave a Comment