Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelangana

జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

సుజాతనగర్ లో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన మంత్రి

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 3)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుంచి బృందావనం వరకు ఆర్.అండ్.బి శాఖ నిధులు రూ.2కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందన్నారు. ఏజెన్సీలోని కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఈ నియోజకవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల తో కలుపుకుని అభివృద్ధిపథంలో నిలుపుతామన్నారు. మంత్రి పర్యటనలో భాగంగా కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర కాలేజీలో సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన రాష్ట్రప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయిపూలే జన్మదినాన్ని ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’ గా ప్రకటించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పధకంలో భాగంగా రూ.657 కోట్ల ఖర్చుతో అన్ని పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించామని వివరించారు. గతంలోని ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు ఇవ్వని మౌలిక వసతులు తమ ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు. జిల్లా పరిధిలో రామవరం ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ కోసం చేస్తున్న కృషిలో భాగంగా కొత్తగూడెం, రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి, అటవీ, ప్రైవేటు భూములు తీసుకుని రాబోయే ఆరు నెలల్లో కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
సింగరేణి కొత్తగూడెం ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని, కొత్తగూడెంలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం సాధించుకుని ప్రతి ఆడబిడ్డకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు.
విద్యకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే పేదవిద్యార్థులకు కనీసం భోజనం కూడా పెట్టలేని పరిస్థితి ఉండేదని, ఈనాడు ఇందిరమ్మరాజ్యంలో కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని ప్రత్యేకంగా ఆలోచనలతో జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ చొరవతో ‘ఏరు పండగ’ను రూపొందించి జనవరి 9న వైకుంఠ ఏకాదశి శుభదినం, భద్రాద్రి శ్రీరామాలయంలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఏరు అనేది ఈ జిల్లాలో మాట్లాడే గిరిజనుల భాషలో “నీరు” అని అర్థమని, ఈ పేరు గోదావరి నది ఘాట్ల చుట్టూ నిర్వహించే వేడుకలను ప్రతిబింబించేందుకు ఎంపిక చేశారని వివరించారు. కలెక్టర్ ఆలోచన మేరకు ఈ పండుగ జిల్లాలోని భద్రాచలం ఆలయం, గోదావరిలో బోటింగ్, కనకగిరి శిఖరం, గిరిజన గ్రామంలో ఓ అనుభవం, కిన్నెరసాని డ్యామ్, జింకల పార్కు వంటి పర్యాటక ప్రదేశాలపై దృష్టి సారించేలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి
పాల్వంచ మండలం రెడ్డిగూడెంలో రూ. 1.70 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాల్వంచ బైపాస్ రోడ్డుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీతారాంపట్నం-పాండురంగాపురం మధ్య రూ.10 కోట్ల వ్యయంతో బ్రిడ్జి వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవాలు

Divitimedia

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు పకడ్బందీగా పరిశీలించాలి

Divitimedia

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

Divitimedia

Leave a Comment