Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadLife StyleSpecial ArticlesTechnologyTelangana

నిబంధనలతో మాకు పనేంటి…?

నిబంధనలతో మాకు పనేంటి…?

ప్రశ్నార్ధకంగా మారుతున్న ఇసుకవేలం

బూర్గంపాడులో అధికారుల ఇష్టారాజ్యం

✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 3)

‘మేం ఏం చేయాలనుకుంటే అది… ఎలా చేయాలనుకుంటే అలా… చేసేస్తాం… మాకు ఎలాంటి నిబంధనలు అక్కర్లేదు… ఎవరైనా ప్రశ్నించినా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు… మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు…’ ఇదీ బూర్గంపాడులో అధికారుల తీరు. మండలంలో జోరుగా సాగిపోతున్న ఇసుక అక్రమ రవాణాను ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న రెవెన్యూశాఖాధికారులు ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒకచోట ఇసుక సీజ్ చేస్తున్నారు. తమకు నచ్చిన వారి విషయంలో ఒకవిధంగా, నచ్చని వారి విషయంలో మరోలా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మండలంలో ఇసుక అక్రమ రవాణా నిరోధంలో చేతులెత్తేసిన విధంగా అక్రమార్కుల జోలికి పోకుండా కొంతకాలంపాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు ఏదో మొక్కుబడిగా ఎక్కడో ఒకచోట ఇసుక సీజ్ చేస్తున్నారు. ఇదొక ఎత్తయితే, అలా స్వాధీనం చేసుకున్న (సీజ్ చేసిన) ఇసుక వేలం వేసే విషయంలోనైతే అధికారులు వ్యవహరిస్తున్నతీరు మరీఘోరంగా, తీవ్ర విమర్శలమయంగా మారింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఏదైనా సామగ్రిని వేలం వేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఇటీవల సారపాకలో భారీగానే ఇసుక స్వాధీనం చేసుకున్న అధికారులు, తర్వాత దానిని ‘వేలం వేసే విషయం’లో వ్యవహరించిన తీరు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలకు దారితీస్తోంది. దాదాపు 15లారీలకు పైగా ఉన్న ఇసుక ప్రాథమిక అంచనా ప్రకారం చూస్తే దాదాపు రూ.8 లక్షలకు పైగానే ఉంటుందన్నారు. ఇంత భారీమొత్తంలో ఇసుక వేలంపాట నిర్వహించిన మండల రెవెన్యూశాఖాధికారులు నామమాత్రంగా ఓ వాట్సాప్ గ్రూపులో అరకొరగా ఇచ్చిన సమాచారంతో వేలం వేశారు. కనీసం ఆ ఇసుక పరిమాణం ఎంత? అధికారికంగా నిర్ణయించిన కనీస ధర ఎంత? వేలంలో పాల్గొనేందుకు అర్హతలేంటి?, డిపాజిట్ ఎంత చెల్లించాలి?, వేలంపాటలో ఇసుక దక్కించుకున్నవారు ఏ సమయంలోగా మొత్తం డబ్బు చెల్లించాలి?, ఎన్నిరోజుల లోపు ఇసుకను తీసుకువెళ్లాలి? వంటి వివరాలు, నిబంధనలతో ముందుగానే ప్రకటన విడుదలచేయాలి. వేలంపాటలో ఎక్కువమంది పోటీపడేలా, అందరికీ తెలిసే విధంగా, కనీస గడువుతో ముందే ఆ ప్రకటన జారీచేయాలి. ఇలాంటి పలు విధానాలు పాటించాల్సిన ఆధికారులు, అవేమీ పట్టించుకోకుండా కేవలం ఒక వాట్సాప్ గ్రూపులో ప్రకటించి వేలంపాట నిర్వహించడం గమనార్హం. ఈ దుస్థితిలో దాదాపు 15లారీలకు పైగా ఇసుక కేవలం రూ.3.10లక్షలకు వేలంలో పోవడం బట్టి చూస్తే అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇదేతరహాలో మూడు రోజుల క్రితం ఉప్పుసాక గ్రామం వద్ద సీజ్ చేసిన ఇసుకను కూడా వేలం వేసేందుకు బూర్గంపాడు మండల రెవెన్యూశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇసుక వేలంపాట నిర్వహణ తీరుపై ‘దివిటీ మీడియా’ ప్రథినిథి లేవనెత్తిన అంశాలు, అనుమానాలను కూడా తహసిల్దారు ముజాహిద్ పట్టించుకోలేదు.
——————
ఈ ఇసుక వేలంపాట జరిగిన తీరును ‘దివిటీ మీడియా’ ప్రతినిథి భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు దృష్టికి తీసుకు వెళ్లగా, పరిశీలించి చర్యలు తీసుకునేలా ఆయన హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం మీద ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో? చూడాలి మరి.

Related posts

జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి

Divitimedia

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Divitimedia

భద్రాచలం దేవస్థానం కొత్త ఈఓ బాధ్యతల స్వీకరణ

Divitimedia

Leave a Comment