ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 23)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించి టీఎస్-ఐపాస్, టీప్రైడ్ కింద అర్హత కలిగిన పరిశ్రమలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ టీఎస్-ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలంగా ఉన్నందున తగిన పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారన్నారు. అన్ని రకాల అర్హతలుంటే పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులివ్వాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీఎస్ -ఐపాస్, టీప్రైడ్ కింద పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, ముద్ర రుణాలు వంటి పథకాలు, డీఆర్డీఏ ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పరిశ్రమలు స్థాపించాలన్నారు. టీప్రైడ్ పథకం ద్వారా 35, 45 శాతం సబ్సిడీ పొందవచ్చన్నారు. టీఎస్-ఐపాస్ కింద పరిశ్రమలకు కావాల్సిన అనుమతుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మినీ రైస్ మిల్లులు, చేపల పెంపకం, ఆయిల్ పాం, మేజ్ పరిశ్రమలు, వివిధ కులవృత్తులకు చేయూత, రవాణా వాహనాలు, తదితర అవకాశాలు వినియోగించుకుని గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. అశ్వాపురం భారజల కర్మాగారం అణుజల ఉత్పత్తి అనంతరం వృధాగా వదిలేస్తున్న నీటిలో పోషకాలు ఉంటాయని, ఆ నీటిని ఉపయోగించి మినరల్ వాటర్ ప్లాంటు స్థాపించుకుని స్థానిక గిరిజనులు అభివృద్ధి చెందవచ్చని సూచించారు. ఆ కర్మాగారం నుంచి వచ్చే ఫ్లైయాష్ ఉపయోగించి ఇటుకల తయారీ పరిశ్రమలు నెలకొల్పే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గిరిజనులకందించే రుణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి తిరుపతయ్య, ఐపీఓ పృథ్వి, జిల్లా ఫైర్ అధికారి క్రాంతికుమార్, జిల్లా మైనింగ్ అధికారి దినేష్, ఎల్డీఎం రాంరెడ్డి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.