ఆశ్రమ విద్యాలయం తనిఖీ చేసిన ఎస్పీ
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
✍️ అన్నపురెడ్డిపల్లి – దివిటీ (డిసెంబరు 21)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతిగదుల్లో ఉపాధ్యాయుల బోధనతీరు పరిశీలించి, విద్యార్థులనడిగి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులతో సమావేశమై సూచనలు చేశారు. హాస్టల్లో ఉంటూ, చదువుకునే విద్యార్థులు కష్టపడి చదువుకుని తమ తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని సూచించారు. చెడువ్యసనాలకు దూరం ఉంటూ క్రమశిక్షణతో మెలగాలని ఎస్పీ కోరారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్దగా విని ప్రతిఒక్కరూ ఉన్నతస్థాయికి చేరేలా మెలగాలని తెలియజేశారు. తమ తల్లిదండ్రులు,చదువుచెప్పే గురువులను జీవితంలో ఏ స్థాయికి చేరినా మరువ కూడదన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా సినిమాల్లో చూపించే మంచి మాత్రమే తీసుకుని స్ఫూర్తి పొందాలని, సినిమాలో హీరో లాగానే నిజజీవితంలో ఫీలై చెడుమార్గంలో నడిస్తే చివరికి జీరో అవుతారన్నారు. వంటశాల, స్టోర్ రూం, డైనింగ్ హాళ్లు పరిశీలించిన ఎస్పీ అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూ అమలు తీరుతెన్నులను గురించి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజు మధ్యాహ్నభోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.