ఎన్నికలకు ముందు INTUCలో భారీ చేరికలు
రికగ్నైజ్డ్ యూనియన్ TNTUC కి ఎదురుదెబ్బ
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ‘ITC–PSPD’లో కార్మికసంఘం ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ పరిశ్రమలో తాజాగా గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన తొలిసారి కార్మికసంఘాలతో ఒక సమావేశం నిర్వహించిన కార్మికశాఖ, మరోసారి ఈనెల 21న రెండో సమావేశం నిర్వహించనుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆరోజు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ITC-PSPD లో ఎన్నికల హడావుడి పెరిగిపోతోంది. ప్రతి కార్మికుడి మద్ధతు కూడగట్టుకునేలా అన్ని యూనియన్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే 13వ వేతన ఒప్పందంలో భాగస్వాములైన TNTUC ఆఫీస్ బేరర్స్, తాజాగా మంగళవారం ఆ యూనియన్ నుంచి INTUCలో చేరడం చర్చనీయాంశమైంది. తాము TNTUCకి, కార్యవర్గానికి రాజీనామాచేసి INTUCలో చేరుతున్నట్లు విజయభాస్కరరెడ్డి, రెడ్డెం రామకృష్ణారెడ్డి, సుతార్ నరేష్ కుమార్ అనే కార్మికులు ప్రకటించారు. INTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వర రెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గోనె దారుగా సమక్షంలో వారు ముగ్గురూ INTUCలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచి వేతనం ఒప్పందం జరగాలంటే INTUC- మిత్రపక్షాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పార్టీపరంగా కూడా తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయంటూ, ఈ సందర్భంగా సీనియర్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యుడు యారం పిచ్చిరెడ్డి, ITC – PSPD సారపాక INTUC అధ్యక్షుడు గోనె రామారావు, పలువురు INTUC నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మద్ధతుదారులు పాల్గొన్నారు.