‘మినిమమ్ వేజెస్ బోర్డ్ ‘ మెంబర్ గా యారం పిచ్చిరెడ్డి
జీఓ జారీచేసిన తెలంగాణ కార్మికశాఖ
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 12)
తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యుడిగా సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమలోని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డి గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్మికశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ జీఓ నెం.21 జారీచేశారు. గత మార్చిలో రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి అధ్యక్షుడిగా ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ ను నియమించిన ప్రభుత్వం, తాజాగా గురువారం 12మంది సభ్యుల ను నియమించింది. కార్మికసంఘాల నుంచి ఐదుగురు, పరిశ్రమవర్గాల నుంచి ఐదుగురు, స్వతంత్ర సభ్యులు ఇద్దరిని నియమించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య సంస్థల్లో పనిచేసే లక్షలమంది కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేసే ‘రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి’ జనక్ ప్రసాద్ అధ్యక్షతన మరో పన్నెండు మంది సభ్యులతో రానున్న రెండేళ్లపాటు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బోర్డ్ సభ్యులుగా కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుగా సారపాక ఐటీసీ (ఐఎన్టీయూసీ) నుంచి యారం పిచ్చిరెడ్డి, హనుమకొండకు చెందిన (ఐఎన్టీయూసీ) నాయకుడు ఎస్.నర్సింహారెడ్డిలతోపాటు హిమాయత్ నగర్ నుంచి ఏఐటీయూసీ నాయకుడు ఎండి.యూసఫ్, పటాన్చెరు శ్రీరామ్ నగర్ కాలనీకి నుంచి ‘తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ఎంప్లాయిస్ ఆసోసియేషన్’ నాయకుడు నథెట్లరాజు ముదిరాజ్ సభ్యులుగా నియమితులయ్యారు. వీరి తోపాటు ‘హైదరాబాద్ హోటల్ వర్కర్స్ యూనియన్’ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి సభ్యుడిగా నియమితుల య్యారు. పరిశ్రమల వర్గాల నుంచి మీలా జయదేవ్, కశ్యప్ రెడ్డి, మహిమ దాట్ల, నర్రా రవికుమార్, హన్మకొండ సహాయం పేటకు చెందిన బాసాని చంద్రప్ర్రకాశ్ సభ్యులుగా నియమితులయ్యారు. స్వతంత్ర సభ్యులుగా ప్రొఫెసర్ జి.రవి, ప్రొఫెసర్ నిముషకవి వాసంతి కమిటీలో నియమితులయ్యారు. సారపాక ఐటీసీ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, తెలంగాణ రాష్ట్రస్థాయిలోని కనీసవేతనాల సలహా మండలి సభ్యుడి హోదాలో ప్రాతినిథ్యం వహించడం పట్ల ఐటీసీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు, కార్యవర్గ సభ్యులు హర్షం ప్రకటిస్తూ అభినందించారు.